
* పార్లమెంట్ లో కేంద్రాన్ని కోరిన ఎంపీ కడియం కావ్య
ఆకేరు న్యూస్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో యువత సాధికారతకు కేంద్రం చేపడుతున్న కార్యక్రమాలపై లోక్సభలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ప్రశ్నించారు. యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి, వ్యవస్థాపకత లక్ష్యంగా తీసుకొచ్చిన పథకాల వివరాలను తెలియ జేయలని కేంద్ర మంత్రిని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య కోరారు.వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర కార్మిక & ఉపాధి మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా సమాధానం ఇచ్చారు. రాష్ట్రీయ యువ సశక్తికరణ్ కార్యక్రమ్ (RYSK), నేషనల్ సర్వీస్ స్కీమ్ (NSS) మరియు MY భారత్ వంటి కార్యక్రమాలు తెలంగాణలో అమలవుతున్నాయని వివరించారు. MY భారత్ 2025-26 వార్షిక ప్రణాళికలో భాగంగా వరంగల్ సహా రాష్ట్రంలోని జిల్లాల్లో “ఏక్ పెడ్ మా కే నామ్”, “స్కిల్స్ ఫర్ సక్సెస్”, “జిల్లా స్థాయి క్రీడా పోటీలు”, “విక్షిత్ భారత్ – యువ ఉత్సవ్” లాంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇక తాజాగా ప్రకటించిన ₹2 లక్షల కోట్ల ప్రధానమంత్రి ప్యాకేజీ ద్వారా ఐదేళ్లలో 4.1 కోట్ల మంది యువతకు నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి అవకాశాలు లభిస్తాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ.. ఖేలో ఇండియా”, “ఫిట్ ఇండియా”, “పిఎమ్ఈజీపీ”, “స్కిల్ ఇండియా మిషన్” వంటి జాతీయ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో మరింత వేగవంతం చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిభ కలిగిన యువత ఉన్నారని తెలిపారు. వారికి సరైన అవకాశాలు కల్పిస్తే, వారు జాతీయ అభివృద్ధికి దోహదపడతారని తెలియజేశారు. రాష్ట్ర యువతకు ప్రాముఖ్యత ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు.
………………………………………