* కంటికి కనిపించని క్రిములతో అనారోగ్య ముప్పు
*సబ్బుతో చేతులు కడుక్కునే సౌకర్యం కరువు
* ఒకవైపు సౌకర్యాలున్నా నిర్లక్ష్యం..
* నేడు ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం
Global Handwashing Day| ఆ చేతులతో ఆహారాన్ని తాకితే అవి కడుపులోకి చేరవచ్చు. కళ్లు, ముక్కు, నోరు తాకినా ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. చేతులు కడుక్కోవడంలో చేసే చిన్న నిర్లక్ష్యం మనతోపాటు కుటుంబ సభ్యులనూ అనారోగ్యం బారిన పడేయవచ్చు. కరోనా సమయంలో చేతుల శుభ్రతపై విస్తృత ప్రచారం జరిగింది. కానీ అత్యవసర పరిస్థితి ముగిశాక అవగాహన కార్యక్రమాలు, నిధులు, నిర్వహణపై శ్రద్ధ తగ్గిపోతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. మరోవైపు, చేతులు కడుక్కోవాలన్నా ఇంటివద్ద నీళ్లు సబ్బు రెండూ అందుబాటులో లేని ప్రజలు ప్రపంచవ్యాప్తంగా 170 కోట్ల మంది ఉన్నారు. అక్టోబర్ 15 న ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా ఈ రెండు సమస్యలపైనా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
* ఎలా మొదలయిందంటే..?
ప్రపంచ చేతుల పరిశుభ్రత దినోత్సవం ( Global Handwashing Day ) 2008 అక్టోబర్ 15న ప్రారంభమైంది. అప్పటి ప్రజా-ప్రైవేటు చేతుల పరిశుభ్రత భాగస్వామ్య సంస్థ, ప్రస్తుతం గ్లోబల్ హ్యాండ్వాషింగ్ ( Hand washing ) పార్ట్ నర్ షిప్ గా పిలిచే సంస్థ, దీనికి శ్రీకారం చుట్టింది. తొలి ఏడాదే 73 దేశాల్లో సుమారు 12 కోట్ల మంది పిల్లలు సబ్బుతో చేతులు కడుక్కునే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చిన్న వయసులోనే అలవాటు పెంచితే కుటుంబాలకు, సమాజానికి సందేశం చేరుతుందన్నది ఈ కార్యక్రమం ఉద్దేశం. భారత్లో తొలి దినోత్సవ ప్రచారంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా పాల్గొన్నారు.
* మురికి కనిపించకపోయినా.. ముప్పు ఉంటుంది
చేతులు శుభ్రంగా కనిపించడం, వాటిపై వ్యాధికారక క్రిములు లేకపోవడం ఒకటి కాదు. సబ్బుతో కడుక్కోవడం వల్ల చేతులకు అంటిన మురికి, క్రిములు తొలగిపోవడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా తినడానికి ముందు, మరుగుదొడ్డిని ఉపయోగించిన తరువాత చేతులు కడుక్కోకపోవడం వ్యాధుల వ్యాప్తికి అవకాశం కల్పిస్తుంది.
మలంతో కలుషితమైన చేతుల ద్వారా క్రిములు ఆహారం, నీటిలోకి చేరవచ్చు. అతిసార వ్యాధులు, కడుపులో ఇన్ఫెక్షన్లు వ్యాపించవచ్చు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చేతులకు అంటిన క్రిములను ఇతర వస్తువులకు, వ్యక్తులకు చేరవేయవచ్చు. కలుషితమైన చేతులతో కళ్లు రుద్దుకోవడం ఇన్ఫెక్షన్ వ్యాప్తికి దోహదపడవచ్చు.
కడుక్కోని చేతులతో వంట చేయడం, ఆహారం వడ్డించడం, పిల్లలకు తినిపించడం వల్ల ఇతరులకూ క్రిములు చేరవచ్చు. చేతుల పరిశుభ్రతతో అతిసార వ్యాధులు సుమారు 30 శాతం, తీవ్రమైన శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు 17 శాతం తగ్గవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ( WHO ) పేర్కొంటోంది. చేతులు కడుక్కోవడంతో అన్ని వ్యాధులూ పూర్తిగా నివారించవచ్చని అర్థం కాదు.
*తెలియక చేసే తప్పు.. తెలిసీ చేసే నిర్లక్ష్యం
చేతులు కడుక్కోవడం అంటే కుళాయి కింద రెండు వేళ్లు తడిపి రావడం కాదు. భోజనానికి ముందు చేతులు తడిపితే చాలు అనుకోవడం, సబ్బు అవసరాన్ని పట్టించుకోకపోవడం, పిల్లలకు చెప్పి పెద్దలు ఆచరించకపోవడం ఇలాంటి అలవాట్లను మార్చుకోవాలి.చేతులు బాగానే ఉన్నాయనిఅనుకోవద్దు, క్రిములు కంటికి కనిపించవు. సబ్బును పక్కన పెట్టొద్దు. కేవలం నీటితో కడగడం కంటే సబ్బుతో కడగడం ప్రభావవంతం.
బేసిన్ ఉంటే సరిపోదు. అందులో నీరు, పక్కన సబ్బు అందుబాటులో ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అలవాట్లు మారాలంటే అవగాహనతోపాటు సౌకర్యాలు కూడా అవసరమని ప్రపంచ ఆరోగ్యం సంస్థ ( WHO ) యూనిసెఫ్ (UNICEF ) మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి. నీరు, సబ్బు అందుబాటులో ఉంచడం, వాటిని సులభంగా ఉపయోగించుకునే వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉంది.
*సబ్బు కొనలేని పరిస్థితి.. నీళ్లు దొరకని జీవితం
ప్రపంచ ఆరోగ్యం సంస్థ ( WHO ) – యూనిసెఫ్ (UNICEF ) సంయుక్త పర్యవేక్షణ కార్యక్రమం (JMP) విడుదల చేసిన 2024 అంచనాలు కనీస సౌకర్యాల్లో ఉన్న అంతరాన్ని చూపిస్తున్నాయి. 170 కోట్ల మందికి ఇంటివద్ద నీరు, సబ్బుతో కూడిన ప్రాథమిక చేతుల శుభ్రత సౌకర్యం లేదని తేలింది .సుమారు 100 కోట్ల మందికి చేతులు కడుక్కునే ఏర్పాటు ఉన్నా, అక్కడ నీరు లేక పోవడం సబ్బు లేక పోవడం లేదా రెండూ లేకపోవడం జరుగుతోంది.
61.1 కోట్ల మంది: ఇంటి ఆవరణలో చేతులు కడుక్కునే ఏర్పాటే లేదు.ప్రాథమిక సౌకర్యాల లభ్యత గ్రామీణ ప్రాంతాల్లో 71 శాతం కాగా, పట్టణాల్లో 86 శాతం. తాగునీటి కోసమే ఇబ్బందిపడే కుటుంబానికి చేతులు కడుక్కోవడానికి నీటిని అందుబాటులో ఉంచడం మరో సవాలు. ఇలాంటి పరిస్థితుల్లో “చేతులు కడుక్కోండి” అనే ప్రచారంతోపాటు నిరంతర నీటి సరఫరా, సబ్బు, నిర్వహణకు నిధులు కల్పించాల్సిన బాధ్యత పాలకులపైన ఉంది .
* కరోనా పాఠం.. రోజువారీ అలవాటుగా మారాలి
కరోనా చేతుల పరిశుభ్రతను ప్రతి ఇంట్లో చర్చకు తీసుకొచ్చింది. అయితే కోవిడ్ ప్రధానంగా గాలిలోని వైరస్ కణాల ద్వారా వ్యాపిస్తుంది. కలుషిత ఉపరితలాల ద్వారా వ్యాప్తి ప్రధాన మార్గం కాదని పరిశోధనలు స్పష్టం చేశాయి. అందుకే చేతుల శుభ్రతతోపాటు గాలి ప్రసరణ వంటి రక్షణ చర్యలూ అవసరం.
చేతుల శుభ్రతకు ఈ సందర్భాలు మరిచిపోవద్దు…వంట చేయడానికి ముందు, భోజనం తినడానికి ముందు. పిల్లలకు ఆహారం తినిపించే ముందు. మరుగుదొడ్డిని ఉపయోగించిన తరువాత, పిల్లల మలం శుభ్రం చేసిన తరువాత. దగ్గిన తరువాత, తుమ్మిన తరువాత, ముక్కు తుడుచుకున్న తరువాత. చేతులు మురికిగా ఉన్నప్పుడు, చేతులు తడిపి సబ్బు రాసుకుని కనీసం 20 సెకన్లపాటు అరచేతులు, చేతుల వెనుక భాగం, వేళ్ల మధ్య, గోళ్ల కింద రుద్దాలి. తరువాత నీటితో కడిగి శుభ్రమైన తువాలు లేదా గాలితో ఆరబెట్టుకోవాలి. చేతులు కడుక్కోవడం గుర్తుచేసే బోర్డు కంటే.. పనిచేసే కుళాయి, అందుబాటులో సబ్బు, వాటిని ఉపయోగించే అలవాటు ముఖ్యం. సౌకర్యాలున్నవారు నిర్లక్ష్యాన్ని వదలాలి. లేనివారికి ఆ సౌకర్యాలు కల్పించాలి. “జర చేతులు కడుక్కోండి .. బాబూ” అనే మాట ఇంట్లోనూ, బడిలోనూ, హోటల్లోనూ రోజువారీ ఆచరణ కావాలి

Please tell us what is wrong. Your report will be sent to the website team.

