
* మరోసారి రెపోరేటు తగ్గించిన ఆర్బీఐ
* ఏకంగా 50 బేసిస్ పాయింట్లు తగ్గింపు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గృహ, వాహన రుణ వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గుడ్ న్యూస్ చెప్పింది. వరుసగా మూడోసారి రెపోరేటు తగ్గించింది. అనూహ్యంగా ఈసారి 50 బేసిస్ పాయింట్లు తగ్గించడం గమనార్హం. దీంతో రెపోరేటు (Repo Rate) 6 శాతం నుంచి 5.50 శాతానికి చేరనుంది. ఆర్బీఐ తీసుకున్న తాజా నిర్ణయంతో బ్యాంకు ఈఎంఐలు తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీరేట్లు తగ్గనున్నాయి. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఆర్బీఐ (RBI) ఈ ఏడాది ఫిబ్రవరి, ఏప్రిల్ నెలల్లోనూ కీలక వడ్డీరేట్లను 25 బేసిస్ పాయింట్లు మేర తగ్గించింది. తాజా ప్రకటనతో ఈ ఏడాదిలో రెపో రేటు ఇప్పటి వరకు ఒక శాతం మేర తగ్గింది. తాజా సవరణలతో ఈ ఏడాది ద్రవ్యోల్బణం 4 శాతం నుంచి 3.7 శాతానికి దిగిరావచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. మరోవైపు స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటును 5.25 శాతంగా ఉంచిన ఆర్బీఐ, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటును 5.75 శాతంగా ఉంచింది. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో స్టాక్ మార్కెట్లు (STOCK MARKETS) ఫుల్ జోష్లో కొనసాగాయి.
…………………………………………