
– ఫీజులో 50 శాతం రాయితీ
– ఉత్తర్వులు జారీ చేసిన హైదరాబాద్ డీఈఓ
– ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు అమలుచేసేనా?
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
మహానగరంలోని ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల గురించి ప్రత్యేకంగా చెపాల్సిన అవసరం లేదు. అవి ఎంతో వింటేనే గుండె ఝల్లుమంటుంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 20 శాతం వరకు ఫీజులు పెంచుతూ ఇప్పటికే స్కూళ్ల నుంచి తల్లిదండ్రులకు ఫోన్లు వస్తున్నాయి. ఆ ఫీజు విని ఏడాది అంతా కష్టపడి దాచుకున్న సొమ్ము ఒక్క జూన్ మాసంలోనే ఆవిరైపోతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే జర్నలిస్టులకు కొంత ఊరటనిస్తూ వారి పిల్లలకు ప్రైవేటు స్కూళ్లలో 50 శాతం ఫీజు రాయితీ ఇచ్చారు. ఈ మేరకు హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి రోహిణి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జర్నలిస్టుల పిల్లలకు నెలవారీ ఫీజులో రాయితీ ఇవ్వాలని హెచ్‌యూజే నాయకులు ఇటీవల డీఈఓకు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు స్పందించిన ఆమె ఫీజులో రాయితీ కల్పించాలని ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలకు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. కాగా, ఉత్తర్వులు తప్పనిసరిగా అమలయ్యేలా చూడాలని సంఘం ప్రతినిధులు డీఈఓను కోరారు.
బుట్టదాఖలే
ఏటా డీఈఓ ఉత్తర్వులు జారీ చేయడం, అవి బుట్టదాఖలు కావడం సాధారణంగా మారింది. ఆ ఉత్తర్వులను ప్రైవేటు స్కూళ్ల యజమానులు ఏమాత్రమూ పట్టించుకోవడం లేదు. కొందరైతే ‘అధికారులు మాకేమైనా ఊరికే చేస్తున్నారా’ అని బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. మరికొందరు జర్నలిస్టుల పిల్లలు అంటేనే సీట్లు లేవని చెప్పేస్తున్నారు. ఈక్రమంలో ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ఈసారైన అమలుచేసేనా అనేది ప్రశ్నార్థకంగా మారింది.
………………………………………………..