* నాయకులం కాదు.. ప్రజా సేవకులం..
* కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం
* వర్ధన్నపేట ఎమ్మెల్యే.. విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు
ఆకేరు న్యూస్, వరంగల్ : నిరుపేదలకు ప్రభుత్వం అండగా ఉంటుందని.. వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు స్పష్టం చేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ పరిధిలోని గోపాలపురం పలు కాలనీలు మొంథా తుఫాన్ ప్రభావంతో ఇళ్లూ, జీవనోపాధి దెబ్బతిన్న నిరుపేద కుటుంబాలకు వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు రేషన్ బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు గారు మాట్లాడారు. “ప్రకృతి విపత్తులు ఊహించని విధంగా ప్రజలపై ప్రభావం చూపుతాయి. తుఫాన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఆకలి అనే సమస్య ఎవరికీ రాకూడదన్న ఉద్దేశంతో తక్షణ సహాయంగా రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నాం. అవసరమైన చోట మరింత సహాయం అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. బాధిత కుటుంబాల సమస్యలను పరిష్కరించేందుకు నా వంతు కృషి కొనసాగుతుంది. ప్రజల కష్టం మా కష్టమే అన్న భావనతో ఎప్పుడూ మీ వెంటే ఉంటాను. ఎలాంటి ఆపద వచ్చినా నేను మీతోనే ఉంటాను” అని తెలిపారు.
మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం..
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, తాము అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం ఆర్టిసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్, కొంతమంది నేతలు కావాలనే విష ప్రచారం చేస్తున్నారని, అధికారం పోయిన కేటీఆర్ కు అహంకారం తగ్గలేదన్నారు. కేటీఆర్, హరీష్ రావులు చేసిన అక్రమాలపై వారి ఇంటి ఆడబిడ్డ కవితనే స్వయంగా ప్రశ్నిస్తుందన్నారు. మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని, మా అమ్మ నన్ను అనునిత్యం చదువుకో అని ప్రోత్సహించేవారని, మా అమ్మ ప్రోత్సాహం వల్లనే ఇప్పుడు నేను మీ అందరి మధ్య ఉన్నానని, మహిళ తలుచుకుంటే కుటుంబం బాగుపడుతుందని, కుటుంబం బాగుంటే గ్రామం బాగుంటుందని, గ్రామాలు బాగుంటే దేశం బాగుంటుందని, మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా లబ్ధి పొందాలని అన్నారు. మామునూరు ఎయిర్పోర్టు ఘనత కాంగ్రెస్ పార్టీదేనని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలు ప్రజా ప్రతినిధులుగా రాణించాలని, కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. స్వయంగా తమ ఇంటి ఆడబిడ్డనే పట్టించుకోని వారు మహిళల గురించి మాట్లాడుతున్నారని, ఉద్యోగాలు మేమే ఇచ్చామని నేతలు చెబుతున్నారని, ఇంటికి ఉద్యోగం ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని, కాళేశ్వరం ప్రాజెక్టును కడితే అది కూలేశ్వరం అయ్యిందని, పదేళ్లు మీరు అధికారంలో ఉండి ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. మేము నాయకులం కాదు ప్రజా సేవకులుగా పనిచేస్తూ ముందుకు వెళుతున్నామని, ప్రజా ప్రభుత్వానికి మహిళల ఆశీర్వాదం ఉండాలని, గ్రామాలలో చదువుకున్న మహిళలు రాజకీయాల్లోకి వచ్చి గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
…………………………………………………
