
* ఘనంగా జరుపుకోవాలి
* మండపాలకు ఉచిత విద్యుత్
* ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం సమీక్ష
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్లో జరిగే అతిపెద్ద పండుగ గణేశ్ ఉత్సవాలు. పండుగ వస్తోందంటే రెండు, మూడు నెలల ముందు నుంచే భారీ విగ్రహాల తయారీలో కొందరు నిర్వాహకులు మునిగితేలతారు. ప్రభుత్వం కూడా ఈ ఉత్సవాలకు ప్రాధాన్యం ఇస్తుంది. ఈక్రమంలోనే ఈ ఏడాది గణేశ్ ఉత్సవాలపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(MCRHRD)లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, డీజీపీ జితేందర్, జీహెచ్ ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్,హైదరాబాద్ , సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు, హైదరాబాద్ , మేడ్చల్ రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) మాట్లాడుతూ రాష్ట్ర రాజధానిలో గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకోవాలని సూచించారు. ప్రజల సహకారంతో దేశంలోనే ఈ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటామన్నారు. అధికారులు గణేష్ ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూసుకోవాలని, గత సంవత్సరం ముఖ్యమంత్రి గణేష్ ఉత్సవాలకు మండపాలకు ఉచిత విద్యుత్ అందించారని తెలిపారు. ప్రభుత్వం గణేష్ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. ఇది అతిపెద్ద వేడుక అని, ఆర్అండ్బీ, జీహెచ్ ఎంసీ, రెవెన్యూ, పోలీస్,హెల్త్, విద్యుత్ అన్ని విభాగాలు సమన్వయం చేసుకొని పని చేయాలని ఆదేశించారు.
నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించాం : డీజీపీ జితేందర్
ఇప్పటికే గణేశ్ మండపాల నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించినట్లు డీజీపీ జితేందర్ (Dgp Jitender) తెలిపారు. కావాల్సిన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. శాంతి భద్రతలు, మండపాల వద్ద విద్యుత్ జాగ్రత్తలు, ట్రాఫిక్ ఇబ్బందులు, విగ్రహాలకు వాహనాలకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని నిర్వాహకులకు సూచించినట్లు తెలిపారు.
…………………………………………