* 600 ఇందిరమ్మ ఇండ్ల మోడల్ హౌస్ నిర్మిస్తున్నాం
* డిసెంబర్ చివరి వరకు ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారుల వివరాల సేకరణ పూర్తి
* రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇండ్లు నిర్మించడమే లక్ష్యం
* భూ భారతి చట్టం ద్వారా పేదల భూ హక్కులు పటిష్టం
* ఇందిరమ్మ ఇళ్లు మోడల్ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
ఆకేరున్యూస్, ఖమ్మం: రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. శనివారం మంత్రి, ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి, అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజలతో కలిసి కల్లూరు ఎంపిడిఓ కార్యాలయ ఆవరణలో రూ. 5 లక్షల అంచనా విలువతో చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లు మోడల్ ఇంటి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి పేదవాడికి తినేందుకు సరిపడా భోజనం, కట్టు కునేందుకు బట్టలు, ఉండటానికి ఒక చిన్న ఇల్లు ఉండాలనే కోరిక ఉంటుందన్నారు. పేదలకు సొంత ఇల్లు కల్పించాలని గతంలో వైయస్సార్ హయంలో రికార్డు స్థాయిలో ఇండ్ల నిర్మాణం జరిగిందని, నేడు మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా ఇండ్లు నిర్మిస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం క్రింద మొదటి విడతగా ప్రభుత్వం నాలుగున్నర లక్షల ఇండ్లను మంజూరు చేస్తుందని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3 వేల 500 ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం నమూనాల కోసం ప్రతి మండల కేంద్రంలో మోడల్ హౌస్ ఒకటి నిర్మిస్తామని, సుమారు 600 ఇందిరమ్మ ఇండ్లు మోడల్ హౌస్‌లు నిర్మించడం జరుగుతుందన్నారు. మోడల్ హౌస్‌ను పరిశీలించి తక్కువ ధరతో నాణ్యతతో ఇల్లు ఎలా కట్టాలో పేదలు పరిశీలించి, వారి స్థలాలలో నిర్మించుకోవాలని మంత్రి సూచించారు. ఇంటిలో నివసించే ప్రజలే నిర్మాణం చేసుకునేలా ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, ఇంటి నిర్మాణానికి ఎటువంటి నిబంధనలు లేవని, 400 చదరపు అడుగులు తగ్గకుండా స్థలంలో ఒక బాత్ రూమ్, ఒక కిచెన్ ఉండేలా నిర్మాణం చేసుకోవాలని మంత్రి తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల క్రింద సొంత స్థలం ఉన్న వారికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం 4 విడతలలో అందుతుందని, ఫౌండేషన్ వేసిన తర్వాత లక్ష రూపాయలు, కిటికి దశ తర్వాత లక్ష పాతిక వేలు, స్లాబ్ దశ చేరిన తర్వాత లక్ష 75 వేల రూపాయలు, ఇళ్లు పూర్తి చేసిన తర్వాత మరో లక్ష రూపాయలు మొత్తం ఐదు లక్షల సహాయం పేదలకు ఇంటి కోసం అందుతుందని అన్నారు.
పేద ప్రజల్లో విశ్వాసం కల్పించేందుకు భూ భారతి చట్టం..
పేద ప్రజలకు అభద్రతా భావం తొలగించి, వారిలో విశ్వాసం కల్పించేందుకు తెలంగాణ భూ భారతి చట్టం 2024 ప్రవేశపెట్టామన్నారు. గతంలో పెండిరగ్ ఉన్న 9 లక్షల సాదా బైనామా దరఖాస్తులకు ఇందిరమ్మ ప్రభుత్వం పరిష్కరిస్తుందని అన్నారు. ప్రజల కోసం తయారు చేస్తున్న భూ భారతి చట్టం సభలో ఆమోదం జరిగే సమయంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడు అసెంబ్లీకి హాజరు కాకపోవడం విచారకరమని అన్నారు. కల్లూరు మండలంలో డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల మంజూరుకు కృషి చేస్తానని, అదే విధంగా రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయం నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రజల డిమాండ్ మేరకు నెల రోజులలో కల్లూరు మున్సిపాలిటీ మంజూరు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, కల్లూరు ఆర్డీవో రాజేందర్, ఆర్ అండ్ బి ఎస్ఇ హేమలత, హౌజింగ్ ఇఇ భూక్యా శ్రీనివాస్, డిసిహెచ్ఎస్ డా. రాజశేఖర్, కల్లూరు, సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు నీరజ ప్రభాకర్, డి. ఆనంద్, సిడిసి ఛైర్మన్ కె. నరేందర్, సత్తుపల్లి మునిసిపల్ చైర్మన్ జయపాల్, మునిసిపల్ కౌన్సిలర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
………………………………………………….