Modern Farming Practices
* రైతువేదికలో సాగు మెలకువలు నేర్పిన జిల్లా వ్యవసాయ అధికారి విజయచంద్ర
* వ్యవసాయ కళాశాల విద్యార్థులతో సమావేశం… క్షేత్రస్థాయి పరిశోధనలపై చర్చ
* కమలాపూర్ ఫర్టిలైజర్ షాప్ ల తనిఖీ
ఆకేరు న్యూస్, కమలాపూర్:
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలో రైతువేదికను జిల్లా వ్యవసాయ అధికారి విజయచంద్ర మంగళవారం సందర్శించి, వంగపల్లి ,మరిపల్లిగూడెం పంగిడిపల్లి, గ్రామ రైతులతో వంగపల్లి రైతువేదికలో సమావేశమయ్యారు. ప్రస్తుత పర్యావరణ పరిస్థితులు, సాగులో ఎదురవుతున్న సమస్యలపై చర్చించి, అనుసరించాల్సిన ప్రత్యామ్నాయ సాగు పద్ధతులను ఆయన రైతులకు వివరించారు.
వర్షాధార పరిస్థితులకు అనుకూలమైన నాణ్యమైన విత్తనాలను ఎంపిక చేసుకోవాలని, డ్రిప్, మైక్రో ఇరిగేషన్ వంటి ఆధునిక నీటి ఆదా పద్ధతులను అవలంబించాలని సూచించారు. వాతావరణ మార్పులకు అనుగుణంగా ఎరువులను సమతుల్యంగా వినియోగించాలని, మల్చింగ్ విధానంతో పాటు క్రమం తప్పకుండా నేల పరీక్షల ద్వారా భూసారాన్ని కాపాడుకోవాలని కోరారు.
*వ్యవసాయ కళాశాల విద్యార్థులు ప్రాంతీయ సమస్యలపై పరిష్కారాలు కనుగొనాలి
ఈ పర్యటనలో భాగంగా పీజేటీఎస్ఏయూ వరంగల్ వ్యవసాయ కళాశాల విద్యార్థులతో ఆయన సమావేశమై తాజా పర్యావరణ పరిస్థితులు, పరిశోధన అంశాలు, విద్యార్థుల ద్వారా రైతులకు అందుతున్న సాంకేతిక సహాయంపై చర్చించారు. విద్యార్థులు తమ ప్రాజెక్టులు, క్షేత్రస్థాయి పరిశీలనలను అధికారితో పంచుకున్నారు. విద్యార్థులను ప్రాక్టికల్ ఫీల్డ్ రీసెర్చ్ వైపు ప్రోత్సహించిన ఆయన, రైతుల భాగస్వామ్యంతో ప్రాంతీయ సమస్యలకు మెరుగైన పరిష్కారాలు కనుగొనాలని పిలుపునిచ్చారు.
*ఎరువుల విక్రేతలకు హెచ్చరికలు
కమలాపూర్ లోని ఫర్టిలైజర్ షాప్ లను జిల్లా వ్యవసాయ అధికారి విజయచంద్ర , మండల వ్యవసాయ అధికారి వేణుతో కలిసి తనిఖీ చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలను ఎరువుల విక్రేతలు ఖచ్చితంగా పాటించాలని ఎరువుల ధరలు, కనీస మద్దతు ధర నిబంధనలను ఉల్లంఘిస్తే, నాణ్యత లేని ఉత్పత్తులను విక్రయిస్తే కఠిన చర్యలుంటాయని విజయచంద్ర హెచ్చరించారు. రైతులందరికీ సరైన ప్యాకింగ్ , కొనుగోలు బిల్లులు ఇవ్వాలని, సరఫరాలో సమస్యలు తలెత్తితే వెంటనే అధికారులకు నివేదించి పరిష్కరించుకోవాలని ఆదేశించారు.
కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వేణు, ప్రజా ప్రతినిధులు సాంబారావు, సర్పంచ్ రాజు, ఏఈవోలు జయప్రకాష్, ప్రశాంత్, తిరుపతి, రహీం, ప్రతాప్ తదితరులతో పాటు మర్రిపల్లిగూడెం, వంగపల్లి రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
