Hanamkonda Muharram Arrangements
* మొహర్రం పండుగకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
– అదనపు కలెక్టర్ ఎన్. రవి
ఆకేరు న్యూస్, హన్మకొండ:
మొహర్రం పండుగను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకునేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి అవసరమైన ఏర్పాట్లు చేయాలని హన్మకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి అధికారులను ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ ఛాంబర్లో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మొహర్రం పండుగ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులు, ముస్లిం మత పెద్దలతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
* ఊరేగింపు మార్గాల్లో ప్రత్యేక సదుపాయాలు
సమావేశంలో మొహర్రం పర్వదిన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన అదనపు కలెక్టర్, ఊరేగింపు మార్గాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సౌకర్యం, రహదారి మరమ్మతులు, విద్యుత్ దీపాలు, నిరంతర విద్యుత్ సరఫరా, వైద్య శిబిరాలు, అగ్నిమాపక భద్రత, ట్రాఫిక్ నియంత్రణ వంటి ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.
* మత పెద్దల సూచనలకు ప్రాధాన్యం
ముస్లిం మత పెద్దలు ప్రస్తావించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. హన్మకొండ బ్రాహ్మణవాడ నుంచి మచిలీ బజార్ వరకు నిర్వహించే మొహర్రం ఊరేగింపుకు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని కాజీపేట ఏసీపీకి సూచించారు.
* జిల్లాలో 170 అషూర్ ఖానాలు
హన్మకొండ జిల్లాలో మొత్తం 170 అషూర్ ఖానాలు ఉన్నట్లు వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ రియాజ్ సమావేశంలో తెలిపారు.
ఈ సమావేశంలో ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ నేత, హన్మకొండ, పరకాల ఆర్డీవోలు వెంకటేష్, డీఎస్ వెంకన్న, పరకాల మున్సిపల్ కమిషనర్ పోతరాజు పవన్, కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి మహ్మద్ వాజీద్ అలీ, కార్మిక శాఖ ఏఎల్వో చాణక్య, ఎన్పీడీసీఎల్ డీఈ గంగారెడ్డి, ఫైర్ అధికారి దిలీప్ కుమార్, మైనారిటీ శాఖ సూపరింటెండెంట్ విజయ్ పాల్ రెడ్డి, ఇతర అధికారులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.
