* ఏపీ నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలింపు..
* ఆత్మకూరు పోలీసుల ఆపరేషన్‌కు దక్కిన విజయం
ఆకేరు న్యూస్, హనుమకొండ: సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడిన ఐదుగురు స్మగ్లర్లకు హనుమకొండ న్యాయస్థానం కఠిన శిక్ష విధించింది. నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు, ఒక్కొక్కరికి రూ. ఒక లక్ష జరిమానా విధిస్తూ హనుమకొండ మొదటి అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి బి. అపర్ణాదేవి బుధవారం చారిత్రాత్మక తీర్పు చెప్పారు.
* కేసు నేపథ్యం ఏమిటంటే?
ప్రాసిక్యూషన్ వివరాల ప్రకారం.. శాయంపేట, ఆత్మకూరు మండలాలకు చెందిన పావురాల వెంకటేష్, అబ్బోజు వెంకటేష్, పరుపల్లి కార్తీక్, అనంతుల సాంబయ్య, కొక్కరకొండ చంద్రయ్యలు ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతం నుంచి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి, మహారాష్ట్రలో ఎక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకోవాలని ప్లాన్ చేశారు.
ఈ క్రమంలో ఒక కారులో రహస్యంగా గంజాయిని తరలిస్తుండగా, ఆత్మకూరు పోలీసులు చౌలపల్లి గ్రామ శివారులో పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నిందితుల నుంచి సుమారు 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఐదుగురిని అరెస్ట్ చేశారు.
* పోలీసుల పకడ్బందీ దర్యాప్తు…
అప్పటి ఆత్మకూరు ఇన్స్పెక్టర్ రాజలక్ష్మి ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులపై పకడ్బందీగా ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. కోర్టు విచారణలో నిందితులపై నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పైవిధంగా తీర్పునిచ్చారు.
ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) బి. రాజమల్లారెడ్డి వాదించగా.. నిందితులకు శిక్ష పడటంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ ఆర్. సంతోష్, కోర్టు లైజన్ ఆఫీసర్ కె. పరమేశ్వరి, కానిస్టేబుల్ ఆర్. ఉమేష్ కీలక పాత్ర పోషించారు. వీరు సాక్షులను సకాలంలో కోర్టులో ప్రవేశపెట్టి నేరం రుజువు చేయడంలో సఫలమయ్యారు.
