* వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ డాక్టర్ కడియం కావ్య
ఆకేరు న్యూస్, హనుమకొండ : సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ అనేది తెలంగాణ సంస్కృతిక జీవన ధార అన్నారు. పూలతో ప్రకృతిని ఆరాధిస్తూ ఆడపడుచులు ఆనందంగా కలసి పాటలు పాడుతూ జరుపుకునే ఈ పండుగ ఐక్యత, స్నేహం, సౌభ్రాతృత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. బతుకమ్మలో ప్రతి పువ్వు ఒక ప్రత్యేకత కలిగి ఉంటుందని, అవి జీవన సమతౌల్యాన్ని సూచిస్తాయని ఎంపీ వివరించారు. తల్లి ప్రకృతికి కృతజ్ఞతగా జరుపుకునే ఈ పండుగలో మన సంస్కృతి, సంప్రదాయాలు, స్త్రీ శక్తి ప్రతిఫలిస్తాయని తెలియజేశారు. ఆడబిడ్డల ఆత్మగౌరవం, వారి జీవన ఉత్సాహం ఈ పండుగ ద్వారా ప్రతిఫలిస్తుందన్నారు. సద్దుల బతుకమ్మ పండుగ కుటుంబాలను, బంధాలను, సమాజాన్ని ఒకే తాటిపైకి తెస్తుందని తెలిపారు. ప్రతి ఇంటా సుఖశాంతులు నిండాలని, తెలంగాణ సంస్కృతి మరింత విశ్వవ్యాప్తంగా వెలుగొందాలని
ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఆకాంక్షించారు.
……………………………………
