హరియానా హరికేన్ @ 66
ఆకేరున్యూస్ డెస్క్ : క్రికెట్ ప్రియులే కాదు యావత్ భారతీయుల హృదయాల్లో నిలిచిపోయిన పేరు. భారత క్రికెట్ గురించి స్మరించుకుంటే మొట్టమొదట గుర్తుకు వచ్చేది కపిల్ దేవ్ పేరే… కపిల్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారత క్రికెటర్లలో సునిల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్లు ఉంటారు. ఆయితే సునిల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ లు బ్యాటింగ్ తో గుర్తింపు పొందితే కపిల్ మాత్రం బౌలింగ్ తో గుర్తింపు పొందాడు.. 70 వ దశకంలో ఇండియాకు ఫాస్ట్ బౌలర్ లేని కొరతను కపిల్ తీర్చాడు.. అప్పటి వరకు స్పిన్ బౌలింగ్ పై మాత్రమే ఆధారపడ్డ ఇండియా జట్టుకు కపిల్ లాంటి ఓ తురుపుముక్క లభించాడు. ఇండియానుండి మొట్ట మొదటి పేస్ బౌలర్‌గా గుర్తింపు పొందిన కపిల్ తన ఇన్ స్వింగ్ బాల్స్ తో ప్రత్యర్థులను గడగడ లాడించే వాడు. కపిల్ దేవ్ పూర్తి పేరు కపిల్ దేవ్ రాం లాల్ నిఖంజ్. కపిల్ తండ్రి పేరు రాంలాల్ , తల్లి రాజ్ కుమారీ.. పాకిస్తాన్ లోని రావల్పండికి చెందిన రాంలాల్ దంపతులు దేశ విభజన సమయంలో ఇండియాలోని హర్యానాకు తరలివచ్చారు. రాంలాల్ భవనాల, కలప వ్యాపారం చేస్తూ ఉండేవాడు.. కపిల్ బాల్యం విద్యాభ్యాసం అంతా హర్యానాలోనే కొనసాగింది. చిన్నప్పటి నుంచి క్రికెట్ పై మక్కువ పెంచుకున్న కపిల్ ఆ తరువాత కాలంలో క్రికెట్ కు ప్రత్యామ్నాయ పదంగా నాణించాడు.డి.ఏ.వి.కళాశాలలో విద్యనభ్యసించిన కపిల్ దేవ్‌కు 1979లో రోమీ భాటియాతో పరిచయం అయింది. 1980లో ఆమెను వివాహం చేసుకున్నాడు. 1996లో కపిల్ దంపతులకు అమియాదేవ్ అనే కూతురు జన్మించింది.
దేశవాళీ పోటీలలో ప్రతిభ
1975 నవంబర్‌లో కపిల్ దేవ్ హర్యానా తరఫున పంజాబ్ పై తొలిసారిగా ఆడి 39 పరుగులకు 6 వికెట్లు సాధించాడు. 1976-77 సీజన్లో జమ్ము కాశ్మీర్ పై ఓపెనింగ్ బౌలర్‌గా రాణించి 36 పరుగులకే 8 వికెట్లు పడగొట్టి తన జట్టును గెలిపించాడు. 1977-78 సీజన్లో సర్వీసెస్‌తో జరిగిన మ్యాచ్ తొలి ఇన్నింగ్సులో 38 పరుగులకే 8 వికెట్లు సాధించి మరో సారి తన ప్రతిభను చాటిచెప్పాడు. అదే మ్యాచ్ రెండో ఇన్నింగ్సులోనే 3 వికెట్లు సాధించి ఒకే అంతర్జాతీయ మ్యాచ్‌లో 10 వికెట్ల ఘనతను తొలిసారిగా పొందినాడు. 1978-79 సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన ఘనతను పొందినాడు. ఇదే సీజన్లో కపిల్ దేవ్ పాకిస్తాన్ పై తొలి టెస్ట్ మ్యాచ్ కూడా ఆడి ఆరంగేట్రం చేశాడు.
టెస్ట్ క్రీడా జీవితం
1978, అక్టోబర్ 16న కపిల్ దేవ్ పాకిస్తాన్ పై ఫైసలాబాదులో తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడినాడు. తొలి టెస్టులో తన గణాంకాలు మ్యాచ్‌ను అంతగా ప్రభావితం చేయలేకపొయాయి. సాదిక్ మహమ్మద్‌ను ఔట్ చేసి తొలి టెస్ట్ వికెట్ సాధించింది ఈ మ్యాచ్‌లోనే.[8] కరాచిలోని నేషనల్ స్టేడియంలో జరిగిన మూడవ టెస్టులో 33 బంతుల్లోనే 2 సిక్సర్లతో అర్థసెంచరీని చేసి భారత్ తరఫున అతివేగంగా అర్థసెంచరీ పూర్తిచేసిన రికార్డు సృష్టించాడు.[9] ఆ తరువాత భారత్ పర్యటించిన వెస్టీండీస్ జట్టుపై ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో 124 బంతుల్లో 126 పరుగులు సాధించి తన తొలి టెస్ట్ శతకాన్ని నమోదుచేశాడు. మొత్తం 131 టెస్టు మ్యాచ్‌లు ఆడిన కపిల్ టెస్టుల్లో 5, 248 పరుగులు చేసి మొత్తం 434 వికెట్లు తీసి ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. 226 వన్ డే మ్యాచ్ లు ఆడిన కపిల్ 3, 783 పరుగులు చేసి 263 వికెట్లు తీసుకున్నాడు.
ప్రపంచ విజేత కపిల్
1983 వ సంవత్సరం భారతీయులు మరిచిపోలేని సంవత్సరం.. భారత క్రికెటర్లు ప్రపంచకప్‌ను ముద్దాడిన సంవత్సరం.. భారతీయులు క్రికెట్ లో ప్రపంచకప్ వస్తుందని ఊహించలేదు.. ఓ విధంగా చెప్పాలంటే కపిల్ దేవ్ ఇంటి చేత్తో ప్రపంచ కప్ సాధించాడని చెప్పవచ్చు. అప్పటి వరకు క్రికెట్లో తిరుగులేని శక్తిగా ప్రపంచంలో నెంబర్ వన్ జట్టుగా చలామని అవుతున్న వెస్ట్ ఇండీస్ జట్టుకు కళ్లెం వేసి అపురూపమైన ప్రపంచ్ కప్ కానుకను భారతీయులకు అందించిన ఘనత కపిల్ దేవ్ దే..సెమీ ఫైనల్ లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ లో భారత జట్టు పేకమేడలా కూలిపోతున్న సమయంలో బరిలోకి దిగిన కపిల్ ఆ మ్యాచ్ లో 175 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి భారత జట్టను ఫైనల్ కు చేర్పించాడు. దురదృష్ట వశాత్తు కపిల్ ఆడిన ఈ చిరస్మరణీయ మ్యాచ్ టెక్నికల్ కారణాల వల్ల రికార్డు కాలేకపోయింది.ఆ తరువాత లార్ట్్స లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ప్రపంచాన్ని శాసిస్తున్న వెస్ట్ ఇండీస్ తో తలపడి వెస్ట్ ఇండీస్ జట్టను మట్టి కరిపించి భారత జట్టుకు ప్రపంచ కప్ ను అందించాడు. 24 ఏళ్ల వయస్సులో ప్రపంచకప్‌ను సాధించిన ఘనత కపిల్ దేవ్ ది. భారత జట్టుకు మొట్టమొదటి ప్రపంచ కప్ ను అందించిన ఘనత కపిల్ దేవ్ ది.
సాధించిన అవార్డులు
1979-80 : అర్జున అవార్డు అందుకున్నాడు. 1982 లో పద్మశ్రీ అవార్డు, 1983 లో విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ దొ ఇయర్ అవార్డు,1991 లో పద్మవిభూషన్ అవార్డు,2002 లో విజ్డెన్ ఇండియన్ క్రికెటర్ ఆఫ్ ది సెంచరీ
2013లో కల్నల్ సికె నాయుడు జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపికయ్యాడు.
………………………………………………………….

