*ఎస్టీలకు కాంగ్రెస్ చేసిన దగా ఇదే..
*హరీశ్ రావు పాయింట్ టు పాయింట్ ఎటాక్
*2730 కోట్ల బడ్జెట్.. ఖర్చు సున్నా!
*ఎస్టీ కార్పొరేషన్ పై హరీశ్ సంచలనం
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎస్సీ, ఎస్టీ వర్గాలకు తీరని అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు. శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం గిరిజన సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు.
*ఎస్టీ కార్పొరేషన్ కు తాళం!
కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టీ కార్పొరేషన్ కు బడ్జెట్ లో 2,730 కోట్ల రూపాయలు కేటాయించి, కేవలం 50 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసిందని హరీశ్ రావు గణాంకాలతో వివరించారు. ఈ 50 కోట్లు కూడా కేవలం జీతాలు, పెట్రోల్ బిల్లులకే సరిపోయాయని, ఒక్క గిరిజన యువకుడికి కూడా లోన్ ఇవ్వలేదని మండిపడ్డారు. సంత్ సేవాలాల్ కార్పొరేషన్ పేరుతో 100 కోట్లు కేటాయించి, ఒక్క రూపాయి కూడా విడుదల చేయకుండా గిరిజనుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని విమర్శించారు.
*లగచర్ల భూములపై దాష్టీకం…
కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో ఎస్టీల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని, దీనిని అడ్డుకున్న గిరిజనులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో పెట్టడం దుర్మార్గమని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్ల కోసం దండాలు పెట్టి, అధికారం రాగానే గిరిజనుల గుండెలపై తన్నడం రేవంత్ రెడ్డి నైజమని ఆయన విమర్శించారు.
*ప్రాజెక్టులపై ఉద్దేశపూర్వక జాప్యం…
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే ఆపుతోందని హరీశ్ రావు ఆరోపించారు. బిఆర్ఎస్ హయాంలోనే 90 శాతం పనులు పూర్తయ్యాయని, ప్యాకేజీ-3లో కేవలం 30 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని మాత్రమే మిగిలి ఉందని గుర్తు చేశారు. ఈ కొద్దిపాటి పని పూర్తి చేస్తే రిజర్వాయర్లు నిండి పంటలకు నీరు అందుతుందని, కానీ కేసీఆర్ కు పేరు వస్తుందనే భయంతో రేవంత్ రెడ్డి పనులను పక్కన పెట్టారని విమర్శించారు.
*కేరళలో అబద్ధాల ప్రచారం…
తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేశామని రేవంత్ రెడ్డి కేరళలో అబద్ధాలు చెబుతున్నారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు. “ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకీల మోత” అన్నట్లుగా తెలంగాణలో రుణమాఫీ కాలేదు, మహాలక్ష్మి డబ్బులు అందలేదు, పెన్షన్లు పెరగలేదు కానీ పక్క రాష్ట్రాల్లో మాత్రం గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడ కాంగ్రెస్ ఓడిపోతుందని, ఆయనది ‘ఐరన్ లెగ్’ అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.
*బిఆర్ఎస్ హయాంలోనే గిరిజన వికాసం…
గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చడం, ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచడం, పోడు భూములకు పట్టాలు ఇవ్వడం వంటివి కేవలం బిఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమయ్యాయని హరీశ్ రావు స్పష్టం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేయడం ఆపి, గిరిజన సంక్షేమంపై దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు.
