* కవిత ఆరోపణలే ఆధారాలుగా కేసుల నమోదు
* వారి అవినీతి, అక్రమాల చిట్టాపై సర్కారు ఆరా?
* ఇప్పటికే తెరపైకి నేరెళ్ల ఇసుక లారీల కేసు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
బీఆర్ ఎస్ నుంచి కేసీఆర్ బిడ్ద కవిత సస్పెండ్ కావడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత మరింత సమష్టిగా పనిచేసి, పార్టీని పటిష్టం చేసుకోవాల్సింది పోయి.. రచ్చకెక్కడం పార్టీ కార్యకర్తలను కలవరపెడుతోంది. ఇప్పుడు కవితను సస్పెండ్ చేయడం కరెక్టేనా.., కాదా అని కొందరు సమాలోచనలు జరుపుతున్నారు. ఇదిలా ఉండగా సస్పెన్షన్ పై స్పందిస్తూ కవిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రధానంగా బీఆర్ ఎస్ కీలక నేతలైన మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ రావులపై ఆమె చేసిన ఆరోపణలు చర్చనీయాంశం కావడమే కాదు.. వారు కేసుల ఉచ్చులో చిక్కుకునేందుకు ఆధారాలుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కవిత ఆరోపణలతో కేసులు..?
బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన కల్వకుంట్ల కవిత రెండు రోజుల అనంతరం తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె బంజారాహిల్స్ నివాసంలో ఉన్నారు. తన కుమారుడు పుట్టినరోజు ఈరోజు (శుక్రవారం) ఉండటంతో కుటుంబంతోనే గడపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రేపోమాపో ఆమె మీడియా ముందుకు వచ్చి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. తాను ఏ పార్టీలోనూ చేరబోనని ఇప్పటికే స్పష్టం చేసిన తరుణంలో కొత్త పార్టీ ఏర్పాటు ఖాయమని కొందరు భావిస్తున్నారు. కవిత కొత్త పార్టీ సంగతి పక్కన పెడితే, రాజీనామా సందర్భంగా ఆమె సంతోష్, హరీశ్‌లపై చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. అధికారంలో ఉన్న పదేళ్లలో అవినీతిలో పాలు పంచుకుని ఇప్పుడు విమర్శిస్తారా అని కవితనూ ప్రశ్నించే వారు ఉన్నప్పటికీ, హరీశ్, సంతోష్ లు అంత అవినీతికి పాల్పడ్డారా అనే చర్చలూ మొదలయ్యాయి. కవిత ఆరోపణలే ఆధారంగా ఇప్పుడు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు, కేసుల నమోదుకు ఆస్కారం ఏర్పడింది.
అది చేసింది సంతోష్ రావే..
సంతోష్ రావు ధన దాహానికి అడ్డూ, అదుపు లేదని, సిరిసిల్ల ఇసుక లారీ కేసులో దళితులను టార్చర్ చేసింది సంతోష్ అని కవిత తాజాగా పేర్కొన్నారు. సంతోష్ రావు ఇంట్లో బంగారం ఉంటేనే.. హరీష్ రావు ఇంట్లో బంగారం ఉంటేనే తెలంగాణ బంగారు తెలంగాణ అయినట్టు కాదన్నారు. సంతోష్‌కు ఎమ్మెల్యే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి అనుచరుడు అని తనకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పారని ఉదాహరణతో సహా కవిత చెప్పారు. అంతేకాదు రూ. 750 కోట్ల విల్లా అతడికి ఎక్కడిదని ప్రశ్నించారు. హరీష్ రావు , సంతోష్ రావులు తలో వర్గం మేంటేయిన్ చేస్తూ కాంగ్రెస్ , బీజేపీ లతో కుమ్మక్కై బీఆర్ఎస్ ను ఓడిపోయేలా చేశారని సంచలన ఆరోపణలు చేశారు.
సంతోష్‌పై తంగలపల్లి పీఎస్‌లో ఫిర్యాదు
కవిత ఆరోపణలతో ఇసుక లారీ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌రావుపై తంగలపల్లి పీఎస్‌లో నేరెళ్ల బాధితుల ఫిర్యాదు చేశారు. సంతోష్ రావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాజన్నసిరిసిల్ల జిల్లా నేరెళ్లలో ఇసుక లారీలను తగలబెట్టారనే ఆరోపణలపై దళితులను, బీసీ యువకులను పోలీసులు నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసిన విషయం తెలిసిందే. ఇసుక లారీ ఢీకొని, ఓ వ్యక్తి మృతి చెందడంతో ఆగ్రహించిన స్థానికులు పలు ఇసుక లారీలను తగులబెట్టారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కొందరిని చిత్రహింసలకు గురిచేశారు. 2017లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ఘటన జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. అలాగే ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ పేరుతో సంతోష్ రావు అడవులను కబ్జా చేసే ప్లాన్ చేశారని కూడా కవిత ఆరోపించారు.
నెక్స్ట్ హరీశ్‌రావు?
ఇక మాజీ మంత్రి హరీశ్‌రావును కూడా కవిత వదల్లేదు. ఆయనకు పాల వ్యాపారం ఉండేది. అధికారంలోకి రాగానే హాస్టళ్లకు పాలు సరఫరా చేశారని ఆరోపణలున్నాయి. రూ.లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని రేవంత్ అంటారు.. కానీ హరీష్‌రావు గురించి మాత్రం మాట్లాడరు. కేసీఆర్‌ను మాత్రమే టార్గెట్ చేస్తారు. కేసీఆర్‌పై సీబీఐ విచారణ చేసిందంటే.. అందుకు కారణం హరీష్‌రావు, సంతోష్రావే అని కవిత ఆరోపించారు. అంతేకాదు.. కాళేశ్వరం అవినీతిలో ప్రధాన పాత్ర ఆయనదే అని అన్నారు. ఈక్రమంలో హరీశ్ చుట్టూ ఉచ్చు మరింత బిగిసే అవకాశాలు లేకపోలేదు. కేటీఆర్‌ను ఓడించేందుకు ప్రత్యర్థులకు హరీశ్‌రావు డబ్బు పంపారన్న కవిత వ్యాఖ్యలపై ఇప్పటికే పార్టీలోనూ చర్చ మొదలైంది. ఆరడుగుల బుల్లెట్టే నన్ను గాయపరిచిందని ఆయనను టార్గెట్ చేసిన కవిత ఆరోపణలకు ఆధారాలను వెదికే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని అన్నింటినీ పరిశీలిస్తే కవిత ఆరోపణల ఆధారంగా హరీశ్.. సంతోష్‌రావులకు మరిన్ని చిక్కులు తప్పవనే చర్చ జరుగుతోంది.
………………………………………………………………
