* భారీ బందోబస్త్ ఏర్పాటు
ఆకేరున్యూస్, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. తెలంగాణ భవన్ నుంచి బీఆరఎస్ నేతలు, తన న్యాయవాదులతో కలిసి హరీష్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు పాత్రపై ఓ ప్రైవేట్ ఛానల్ ఎండీ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నిన్న హరీష్ రావుకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో నేడు ఆయన్ను ఆరుగురు అధికారుల బృందం కీలక అంశాలపై విచారణ చేయనుంది. జాయింట్ సీపీ విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి, డీసీపీ రీతిరాజ్ లతో పాటు మరో ముగ్గురు సిట్ అధికారులు హరీష్ రావును ప్రశ్నిస్తున్నారు. కాగా.. పోలీస్ స్టేషన్లోకి హరీష్ వెంట ఆయన అడ్వకేట్ను కూడా పోలీసులు అనుమతించలేదు. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన అడ్వకేట్.. సిట్ నోటీసులు ఇచ్చిన కేసుతో హరీష్ రావుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎన్ని గంటలు విచారించిన కొత్తగా ఏమీ తేలేది లేదన్నారు.
డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు…

సిట్ విచారణకు హాజరయ్యే ముందు హరీష్రావు తెలంగాణ భవన్ లో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న కుంభకోణాలతో పరువు పోతోందనే ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ కుంభకోణాలను బయటికి తీస్తున్నందుకే కేసులు పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇలాంటి బెదిరింపులకు తాము తలొగ్గేది లేదని స్పష్టం చేశారు.
………………………………….
