– మానేరు వాగులో చెక్ డ్యామ్‌ను పేల్చేశారు
– చెక్ డ్యామ్ కూల్చివేతపై ఉన్నత స్థాయి విచారణ జరపాలి
– అప్పుడు కేసీఆర్ కట్టితే ఇప్పుడు సీఎం రేవంత్ కూల్చుతున్నాడు.
– మాజీ మంత్రి హరీష్ రావు
ఆకేరు న్యూస్, హుజురాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక్క చెక్ డ్యాం అయినా నిర్మించారా అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలం, తనుగుల గ్రామ మానేరు వాగులో చెక్ డ్యామ్ పేల్చిన ఘటనా స్థలాన్ని మంగళవారం మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్ రెడ్డి లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ…తనుగుల గ్రామ మానేరు వాగులో ఇసుక మాఫీయా చెక్ డ్యామ్‌ను పేల్చి వేసిందన్నారు. దీంతో రైతులు, మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దోషులను కాపాడుతుందని ఆరోపించారు. గతంలో పెద్దపల్లి జిల్లా బోజన్నపేట వద్ద హుస్సేన్ మియా వాగు పైన చెక్ డ్యామ్ పేల్చివేతకి వాడే జిలేటిన్ స్టిక్స్ ను, ట్రాక్టర్లను రైతులే పట్టుకొని పోలీసులకు అప్పగించినప్పటికీ కూడా ఇప్పటివరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని హరీష్ రావు అన్నారు.బోజన్నపేట పోలీస్ స్టేషన్లో వందలాది రైతులు సంతకాలు పెట్టి కంప్లైంట్ ఇచ్చినప్పటికీ పట్టించుకోవట్లేదు అన్నారు. ఆనాడు ఇసుక గూండాలను అరెస్టు చేసి ఉంటే ఈనాడు మానేరు చెక్ డ్యామ్ పేల్చి ఉండేవారు కాదని హరీష్ రావు అన్నారు. మానేరు చెక్ డ్యామ్‌ను పేల్చిన ఘటనపై ఇరిగేషన్ అధికారులు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి మూడు రోజులు గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. హైదరాబాదులో పేదల ఇల్లు, ఇక్కడ రైతులకు నీళ్లు లేకుండా కూల్చి వేయడమే తప్ప మీ ప్రభుత్వం వేరే ఏం చేయగలదు అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. చెక్ డ్యామ్‌ను పేల్చిన నిందితులపై కేసు నమోదు చేసి ఉన్నత స్థాయి విచారణ జరపాలని, మానేరు చెక్ డాం నిర్మాణానికైనా ఖర్చును రికవరీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో DR సంజయ్, మాజీ శాసనసభ్యులు రవి శంకర్ ,రసమయి, మనోహర్ రెడ్డి, భారీ సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, రైతులు పాల్గొన్నారు.
……………………………………………
