
* ఇన్సూరెన్స్ డబ్బుల కోసం…
* ఆలస్యంగా వెలుగులోకి…
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : డబ్బు.. డబ్బు.. డబ్బు.. ప్రపంచం డబ్బు చుట్టూరా తిరుగుతోంది. డబ్బే ప్రధానం.. డబ్బే లోకం.. డబ్బే వ్యసనం.. డబ్బే సర్వసం అనే ధోరణికీ దిగజారారు మానవులు.. డబ్బు కోసం ఏదైనా చేయడానికి వెనకాడని పరిస్థితులు దాపురించాయి నేటి సమాజంలో.. మానవత్వం క్రమేణా అడుగంటుతోంది.. కన్నవారిని, తోబుట్టువులను కడదేర్చే కర్కషులుగా మారుతున్నారు. ఇలాంటి ఘటనే కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం తాండూర్ గ్రామంలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. తాండూరు గ్రామానికి చెందిన చాకలి జమున (46) 2025 జనవరి 9న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు ఆమె ప్రమాదవశాత్తు ఇంట్లో కిందపడి మరణించినట్లు కేసు నమోదు చేశారు. ఆరు నెలల తర్వాత చాకలి జమున కుమారుడు చాకలి రాజు (28) హత్యాయత్నం కేసులో పోలీసులకు పట్టుబడ్డాడు. రాజును విచారించే సమయంలో తన తల్లి హత్య ఉదంతం బయటకు వచ్చిందని పోలీసులు వెల్లడించారు. రాజు ముందుగానే తన తల్లిని చంపాలని నిర్ణయించుకుని జమునపై ఆరు ఇన్సూరెన్స్ కంపెనీలలో ఇన్సూరెన్స్ చేయించాడు. జనవరి 9న జమున తలపై బండరాళ్లతో బలంగా కొట్టి చంపాడు. అది ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా పోలీసులను నమ్మించాడు. తల్లి మరణం అనంతరం రెండు కంపెనీల నుంచి రూ. 80 లక్షల ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకున్నాడు. తాజాగా హత్యాయత్నం కేసు విచారణ సమయంలో తన తల్లిని తానే బండరాళ్లతో కొట్టి చంపినట్లు రాజు నేరాన్ని ఒప్పుకోవడంతో పోలీసులు జమున కేసును తిరిగి దర్యాప్తు ప్రారంభించారు.
……………………………….