
ఆకేరు న్యూస్ డెస్క్ : తాను పెంచిన ఎద్దులు.. తనకు అన్నం పెడుతున్న ఎద్దులు నీటమునిగి ప్రాణాపాయ స్థితిలో ఉంటే చూడలేక వాటిని కాపాడబోయి ఎద్దులతోపాటు తనూ మృత్యుఒడిలోకి చేరాడు..ఈ విషాదకర ఘటన నంద్యాల జిల్లా రుద్రవరం మండలం ఆలమూరు గ్రామంలో శనివారం చోటుచేసుకుంది.భాష అనే రైతు పొలంలో పొద్దస్తమానం పని చేసిన ఎడ్లను కాస్త శుభ్రం చేస్తే హాయిగా ఉంటుందనే ఆలోచనతో ఎడ్లను తోలుకొని చెరువులోకి వెళ్లాడు. ఎద్దులకు స్నానం చేయిస్తుండగా ప్రమాదవశాత్తు అవి నీటమునిగాయి. తన కళ్ల ముందు అవినీట మునగడం చూడలేకపోయిన భాష వాటిని కాపాడే ప్రయత్నంలో తనూ నీట మునిగాడు. ఇది గమనించిన స్థానికులు పరుగు పరుగున అక్కడికి చేరుకొని భాషతో పాటు రెండు ఎద్దులను కూడా వెలికి తీశారు. కానీ అప్పటికే ఎద్దులతో పాటు భాష కూడా మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.
………………………………………..