![](https://aakerutelugunews.com/wp-content/uploads/2025/02/images-14.jpg)
* అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా కొన్నికేంద్రాలు
* జూదాలు, పందెం కోళ్లకు అడ్డాలుగా మారుతున్న వైనం
* ముజ్రా పార్టీలు సైతం..
* తాజాగా ఫామ్‌హౌస్‌లో పందెం కోళ్లు..
* ఈకేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి నోటీసులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ శివారుల్లోని కొన్ని ఫామ్‌హౌస్ లు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారుతున్నాయి. ముజ్రా పార్టీలు, క్యాసినో, కోడిపందాలు, జూదాలకు అడ్డాగా మారుతున్నాయి. పోలీసుల తనిఖీల్లో ఈ విషయాలు చాలాసార్లు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని ఫామ్హస్లలో జరుగుతున్న పార్టీల్లో గంజాయి, డ్రగ్స్ కూడా వినియోగిస్తున్నట్లు తేలింది. పోలీసులు దాడులు చేస్తున్నా అక్రమ దందాలకు అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా నగర శివారులోని మొయినాబాద్ లో భారీ క్యాసినో (Casino)ను పోలీసులు (Police) పట్టుకోవడం కలకలం రేపింది. రాజేంద్రనగర్ పోలీసులు.. కోళ్ల పందాలతోపాటు క్యాసినో నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. ఈ ఘటనలో 64 మందిని అరెస్టు చేశారు. రూ. 30 లక్షల నగదుతోపాటు 55 కార్లు, 86 కోళ్లు స్వాధీనం చేసుకున్నారు. పెద్ద మొత్తంలో బెట్టింగ్ కాయిన్స్ కూడా సీజ్ చేశారు. పట్టుబడినవారిలో ఏపీ, తెలంగాణకు చెందినవారు ఉన్నట్లు సమాచారం. నగరానికి చెందిన పలువురు ప్రముఖులు కలిసి క్యాసినో, కోడి పందాలు (Cockfighting) నిర్వహిస్తున్నట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.
2 ఎకరాల నుంచి 10 ఎకరాల్లో..
హైదరాబాద్ శివారుల్లోని దాదాపు వెయ్యికి పైగానే ఫామ్ హౌస్‌లు ఉన్నాయి. మొయినాబాద్, శంషాబాద్ మండలాలతో పాటు శంకర్పల్లి, మేడ్చల్, శామీరపేట, కీసర, శంషాబాద్ తదితర ప్రాంతాల్లో 2 ఎకరాల నుంచి 10 ఎకరాల్లో చాలా ఫామ్ హౌస్‌లు ఉన్నాయి. చాలా మంది ధనికులు ఫాహ్ హౌస్ లో నిబంధనల ప్రకారం పార్టీలు జరుపుకుంటారు. కుటుంబాలతో సరదాగా గడుపుతారు. మరికొందరు నిబంధనలకు విరుద్ధంగా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. గంజాయి, డ్రగ్స్ పార్టీలకు ఫాహ్ హౌస్‌లకు అడ్డాలుగా మార్చుకుంటున్నారు. అంతేకాదు.. కొంత మంది కబ్జాదారులు, నేరస్థులు, గూండాలు ఫామ్ హస్లలో తలదాచుకుంటున్నారు. అక్కడి నుంచే నేరాలకు ప్రణాళికలు రచించుకుంటున్నారు. అత్తాపూర్‌లో జరిగిన ఓ భూకబ్జాలో పాలుపంచుకున్న నేరగాళ్లు మొయినాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్ నుంచి నేరాలకు ప్లాన్ వేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఫామ్‌హౌస్‌లో పందెం కోళ్లు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి నోటీసులు
హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ మండలం తొల్కట్టలోని ఓ ఫామ్‌హౌస్‌లో కోడి పందేల నిర్వహణ వ్యవహారం కలకలం రేపుతోంది. కోడి పందేల నిర్వహణ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి(MLC POCHAMPALLI SRINIVASREDDY)కి పోలీసులు నోటీసులు ఇచ్చారు. మొయినాబాద్ పోలీసులు మాదాపూర్‌లోని ఆయన నివాసంలో నోటీసులు అందజేశారు. కోడి పందేల నిర్వహణపై వివరణ ఇవ్వాలని పోలీసులు అందులో పేర్కొన్నారు. ఫామ్‌హౌస్‌ను భూపతి రాజు అనే వ్యక్తికి లీజుకు ఇచ్చినట్లు శ్రీనివాస్ రెడ్డి చెబుతున్నారు. లీజుకు సంబంధించిన సమగ్ర సమాచారం ఇవ్వాలని పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు.
…………………………………..