* ఓట్ల జాతర.. ఊరికి పద పద..
* హైదరాబాద్ – విజయవాడ హైవేపై వాహనాల బారులు
* హైవేపై సంక్రాంతి నాటి కళ
* విమానాల్లో ప్రవాసాంధ్రులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఊరెళ్లేందుకు చాలా మంది హైదరాబాద్ నుంచి సొంతూళ్ల బాటపడుతున్నారు. ప్రధానంగా ఏపీ వెళ్లే మార్గాలు వాహనాలతో బారులు దీరి ఉన్నాయి. అక్కడ లోక్‌సభతో పాటు, అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండడంతో ఓటు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ మేరకు టీఎస్ ఆర్టీసీ 2000 ప్రత్యేక బస్సులను సాధారణ చార్జీలతోనే నడుపుతోంది. మరోవైపు సొంత వాహనాలతో హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే నేషనల్ హైవే సంక్రాంతి పండుగ రోజులను తలపిస్తున్నాయి. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో..వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఓటు వేయడానికి ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి వెళుతున్న ప్రయాణికుల వాహనాలతో నేషనల్ హైవే కిక్కిరిసి పోయింది.
హైవేపై భారీ ట్రాఫిక్ జాం..
వాహనాల రద్దీ పెరిగిపోవడంతో గట్టు భీమవరం, కీసర టోల్ ప్లాజాల వద్ద టోల్ ప్లాజా సిబ్బంది అదనపు గేట్లను కూడా తెరిచారు. హైదరాబాద్ నుంచి వెళుతున్న వెహికల్స్‌తో ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, భవానిపురంలో ఇప్పటికే భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. స్వంత వాహనాలతో వెళుతున్న వారితో పాటు.. హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీలోని ఆయా నియోజకవర్గాలకు చెందిన వారంతా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసుకుని మరీ స్వగ్రామాలకు పయనమవడంతో ఎక్కడ చూసినా వాహనాల సందడే కనిపిస్తోంది
విమానాల్లో ప్రవాసాంధ్రులు
మరోవైపు బెజవాడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. తెలంగాణ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి బస్సుల్లో వస్తున్న ఏపీ వాసులు.. బెజవాడ బస్ స్టాండ్‌లో బస్సులు మారి స్వగ్రామాలకు పయనమవుతున్నారు. అంతేకాకుండా విదేశాల నుంచి కూడా ప్రత్యేకించి ఓటు వేయడానికి ఏపీవాసులు భారీగా తరలిరావడం విశేషం. శుక్రవారం రాత్రి ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలు ఫుల్ ఆక్యుపెన్సీతో ఉండటమే దీనికి నిదర్శనం. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా ఫ్లైట్స్‌లో అమెరికా నుంచి ఏపీవాసులు వచ్చారు. అలాగే ఆస్ట్రేలియాలో షార్జా నుంచి కూడా శనివారం ఉదయం గన్నవరం విమానాశ్రయానికి రెండు ప్రత్యేక విమానాలు వచ్చాయి. గుంటూరు కృష్ణా జిల్లాల చెందిన 250 మంది ఆంధ్రావాసులు.. షార్జా నుంచి ఏపీకి చేరుకున్నారు. మొత్తంగా 100 మంది వరకు ఓటేసేందుకు ప్రవాసాంధ్రులు వచ్చినట్లు తెలిసింది.
————————————-