* టోల్గేట్ల వద్ద వాహనాల బారులు
* ఓట్లు వేసి నగరానికి..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ఓట్ల పండగ ముగిసింది. ఊళ్లకు వెళ్లినవారు తిరిగివస్తున్నారు. దీంతో హైదరాబాద్ వచ్చే జాతీయరహదారిపై వాహనాలు బారులు తీరి ఉన్నాయి. ఓట్లు వేసేందుకు తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి తెలంగాణలోని సొంత జిల్లాలకు, ఏపీకి భారీ సంఖ్యలో జనం తరలివెళ్లారు. సుమారు 11.50 లక్షల మంది ఓటర్లు వెళ్లినట్లు అంచనా. ఓట్లు వేసి జనం సొంతూళ్లు వదిలి పట్నం బాట పట్టారు. హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమైన ఓటర్లతో విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారి రద్దీగా మారింది. వందలాది వాహనాలు బారులు తీరి వెళుతున్నాయి. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద భారీగా ట్రాఫిక్‌జామ్ అయ్యింది. నిన్న సాయంత్రం నుంచి సుమారు అర కిలోమీటర్ వరకు వాహనాలు బారులు తీరి ఉంటున్నాయి. వాహనాలు నెమ్మదిగా వెళుతున్నాయి. ఒక్కో టోల్గేట్ దాటడానికి 15 నిమిషాలకు పైనే పడుతోంది. 16 గేట్లకుగాను 10 గేట్ల ద్వారా హైదరాబాద్ వైపు వాహనాలను పంపిస్తున్నారు. నగర జనం రాకతో నిన్న, మొన్న ఖాళీగా దర్శనమిచ్చిన హైదరాబాద్ రోడ్లలో మళ్లీ రాకపోకలు పెరిగాయి.
——————–