
* గగనతలంలో పర్యాటకుల విహారం
* హెలీ టూరిజం కాన్సెప్ట్ దిశగా తొలి అడుగు
* హైదరాబాద్ – సోమశిల – శ్రీశైలం మధ్య సేవలు
* ప్రతిపాదనలు రూపొందిస్తున్నాం: మంత్రి జూపల్లి కృష్ణారావు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : టూరిజం అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం కొత్త పుంతలు తొక్కనుంది. పర్యాటక శాఖామంత్రి జూపల్లి కృష్ణారావు ఈ వ్యాఖ్యలు అందుకు ఊతం ఇస్తున్నాయి. సోమశిల, నల్లమల, అమరగిరి ఐలాండ్, ఈగలపెంట ప్రాంతాల్లో వెల్నెస్, స్పిరిచువల్ రిట్రీట్ ప్రాజెక్ట్ కు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. రూ.68.10 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే తెలంగాణలో హెలీ టూరిజాన్ని అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. పర్యాటకులను విశేషంగా ఆకర్షించే విధంగా హెలీ టూరిజం నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. గగనతలంలో కొద్దిసేపు విహరింపజేసి పర్యాటకులకు అహ్లాదాన్ని, అనుభూతిని కల్పించేందుకు హెలీ టూరిజం నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఈజ్ మై ట్రిప్ సంస్థ సహకారంతో హైదరాబాద్ నుంచి సోమశిల అక్కడి నుంచి శ్రీశైలం మీదుగా హైదరాబాద్ కు హెలి టూరిజం నిర్వహణకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. దీని వల్ల మన పర్యాటక రంగం కూడా కొత్తమలుపు తిరుగుతుందని, దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ప్రకటించారు.
అడ్వెంచర్ టూరిజానికి పెద్దపీట
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అనేక పర్యాటక ప్రాజెక్ట్ లు చేపడుతోందని, టూరిజం అభివృద్ధికి తెలంగాణలో అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ గత పదేళ్లలో టూరిజం నిర్లక్ష్యానికి గురైందని పేర్కొన్నారు. స్వదేశీ, విదేశీ పర్యాటకుల సంఖ్యను పెంచాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. విదేశీ పర్యాటకుల సంఖ్యను పెంచేందుకు మౌలిక వసతుల కల్పనతో పాటు విస్తృత ప్రచారం నిర్వహిస్తాం. తద్వారా ఉద్యోగ కల్పనతోపాటు ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగవుతాయి. వాటర్ స్పోర్ట్స్, అడ్వెంచర్ టూరిజానికి పెద్దపీట వేస్తామన్నారు. అమరగిరి ఐలాండ్ ప్రాజెక్టు పనులను ఏడాదిలోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యాటక అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, తెలంగాణలో పర్యాటకంలో అగ్ర స్థానంలో నిలబెట్టడానికి కృషి చేస్తున్నారని అన్నారు. నల్లమల సర్క్యూట్ అభివృద్ధితో ఈ ప్రాంతం పర్యాటక హబ్ గా మారుతుందని చెప్పారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, కలెక్టర్ బదావత్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
………………………………….