
* నయా దారుల్లో సైబర్ ముఠాల మోసాలు
* యువతులను ఎరగా వేసి రూ.కోట్లు కొల్లగొడుతున్న వైనం
* రూ.6 కోట్లు సమర్పించుకున్న నోయిడా వ్యాపారి
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ : ఫోన్లలో మెసేజ్‌లు, లింకులు పంపి దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లు రూటు మార్చుతున్నారు. ఆ తరహా మోసాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతుండడంతో వినూత్న పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. డేటింగ్ యాప్‌లు, ఫేస్ బుక్‌లో యువతుల అందమైన డీపీలు పెట్టి ఆకట్టుకుంటున్నారు. యువతులతో వారిని ట్రాప్ చేయించి ఉన్నదంతా దోచుకుంటున్నారు. వారి వలలో పడి తాజాగా నోయిడాకు చెందిన ఒక వ్యాపారి ఏకంగా 6 కోట్ల రూపాయలను సమర్పించుకున్నాడు. భార్యతో విడాకులు తీసుకున్న అతడికి ఓ డేటింగ్ యాప్‌లో ఒక యువతి పరిచయమైంది. తన మాటలతో ముగ్గులోకి దింపింది. వలపు వల విసిరి తన మైకంలో ఉండేలా చేసుకుంది. అతను పూర్తిగా ఆమె మాయలో పడ్డాక.. ఇదే మంచి అవకాశంగా భావించిన ఆమె ఆన్లైన్ ట్రేడింగ్ గురించి, అతి తక్కువ సమయంలోనే అధిక లాభాలు వచ్చే కంపెనీల గురించి చెప్పడం ప్రారంభించింది. ఆమె చెప్పిన చోట పెట్టుబడులు పెట్టేవాడు. ప్రారంభంలో ఊహించని లాభాలు వచ్చినట్లు చూపించారు. ఆ లాభాలను విత్‌డ్రా చేసుకునేవాడు. దాంతో ఆ యువతిపై మరింత నమ్మకం పెరిగింది. మెల్లగా ఊబిలోకి దింపిన యువతి విడతల వారీగా రూ.6 కోట్లు పెట్టుబడులు పెట్టించింది. ఆ తర్వాత నిర్వాహకులు విత్‌డ్రా ఆప్షన్ క్లోజ్ చేశారు. యువతి కాంటాక్ట్ కూడా కట్ అయింది. దీంతో బాధితుడు ఆమె ప్రొఫైల్‌ను చెక్ చేయగా అది నకిలీదని తెలిసింది. లబోదిబో అంటూ అతడు పోలీసులను ఆశ్రయించాడు.
డేటింగ్ యాప్ లలో తిష్ఠ
వివిధ రకాల డేటింగ్ యాప్‌లు, ఫేస్బుక్, ఇన్‌స్టా వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో నకిలీ ప్రొఫైల్స్, అందమైన యువతుల ఫొటోలతో సైబర్ నేరగాళ్లు తిష్ఠ వేస్తున్నారు. ఆయా యాప్‌లలో రిజిస్టర్ అయిన ప్రముఖులను టార్గెట్ చేస్తున్నారు. తమ మాటలతో వారిని వలలోకి దింపుతున్నారు. హలో డియర్.. నా మాట వింటే అందంతో పాటు అధిక ధనం మీ సొంతం అవుతుందని ఆశ చూపుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయని ప్రలోభపెట్టగానే అనేక మంది అత్యాశకు పోయి డబ్బు పోగొట్టుకుంటున్నారు. కొద్దిరోజులు నిఘా పెట్టి కొంతమందిని సెలక్ట్ చేసుకుంటున్నారు. ముందుగా నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి ముఠాలోని యువతులను రంగంలోకి దింపుతున్నారు. వలపు విసిరి దారిలోకి తెచ్చుకున్న తర్వాత అసలైన పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇన్వెస్టిమెంట్స్లో అధిక లాభాల పేరుతో ఆకర్శించి పెట్టుబడులు పెట్టిస్తున్నారు. ప్రారంభంలో లాభాలు చూపించి ఆ తర్వాత ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టించి అందినంతా దోచేస్తున్నారు. డబ్బులు చేతికి అందగానే ఆచూకీ లేకుండా పోతున్నారు.
మహిళలను సైతం..
అలాగే హనీ ట్రాప్‌కు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియాను పావుగా వాడుకుంటున్నారు. ఇన్ స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లను ఇందుకు వినియోగించుకుంటున్నారు. ఫేస్‌బుక్‌లలో అందమైన డీపీలను పెట్టడం ద్వారా యువకులను ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలో మధ్య వయస్కులైన మహిళలను కూడా టార్గెట్ చేస్తున్నారు. ఫేస్బుక్ డీపీలలో పెట్టే వివరాల ద్వారా మహిళల వయస్సు, వారి ఆర్థిక స్థితిగతులను తెలుసుకుంటున్న సైబర్ నేరగాళ్లు హాయ్ అనే మేసేజ్ 30 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వయస్సున్న వారికి పంపడం ద్వారా చాటింగ్ కూడా చేస్తున్నారు. వారి బలహీనతలను కనుక్కొని బ్లాక్‌మెయిలింగ్ చేస్తున్నారు. ఇటీవల నాగర్‌కర్నూల్‌లో ఓ బ్యాంక్ మేనేజర్‌తో పాటు గౌరవప్రదమైన మరో ఎనిమిది కుటుంబాలకు చెందిన మహిళలకు కూడా తొమ్మిది సెల్ఫోన్ల నుంచి హని ట్రాపింగ్కు సంబంధించిన ఫోన్‌కాల్స్ వచ్చినట్లు తెలిసింది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే తమ పరువు పోతుందని వారు మిన్నకుండిపోయారు.
ఫిర్యాదు చేస్తే ఆట కట్టిస్తాం..
డేటింగ్ యాప్ లు, హనీ ట్రాపింగ్ ద్వారా ఎవరు వేధింపులకు పాల్పడినా నిర్భయంగా ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు. బాధితుల వివరాలు గో ప్యంగా ఉంచుతామని భరోసా ఇస్తున్నారు. సైబర్ నేరాలకు సంబంధించి సరైన అవగాహన లేకపోవడం వల్ల సామాన్యులతో పాటు విద్యావంతులు కూడా నష్టపోతున్నారు. సైబర్ నేరగాళ్లు ఇబ్బంది పెడితే ఫోన్ ద్వారానైనా సమాచారం ఇవ్వాలని అంటున్నారు. కొత్తరకం ఎత్తుగడతో ఇన్వెస్ట్మెంట్ మోసాలకు పాల్పడుతున్న క్రిమినల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ఫేస్బుక్, ఇన్‌స్టా వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో గుర్తుతెలియని మహిళలతో పరిచయాలు పెంచుకోవద్దని పేర్కొంటున్నారు. డేటింగ్ యాప్‌లలో స్నేహం చేసేవారితో ఆచితూచి మాట్లాడాలని సూచిస్తున్నారు
……………………………….