
* డిజిటల్ అరెస్ట్.. రిటైర్డ్ ఉద్యోగులే టార్గెట్
* కేరళ, తమిళనాడు నుంచి నేరగాళ్ల ఫోన్లు
* వృద్ధులను భయపెట్టి.. రక్షిస్తున్నట్లు నమ్మించి..
* తాజాగా 2 కేసుల్లోనే 2 కోట్లు స్వాహా
* గత ఏడాదిలో 120 కోట్లకు పైగానే..
* చిన్నపాటి జాగ్రత్తలతో సేఫ్
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ :
ఇప్పుడు ఎవరికి ఫోన్ చేసినా.. ఓ కాలర్ ట్యూన్ వినిపిస్తోంది.. అది డిజిటల్ అరెస్ట్ కు సంబంధించినదే. దేశం మొత్తం ఈ డిజిటల్ అరెస్ట్ లు దడ పుట్టిస్తుండడంతో కేంద్రం అవగాహన చర్యలు చేపడుతోంది. అయినప్పటికీ నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. సైబర్ నేరగాళ్లు ఎక్కడెక్కడో ఉండి.. హైదరాబాద్ వాసులను బెదిరించి దోపిడీ చేస్తున్నారు. ప్రధానంగా సీనియర్ సిటిజన్లనే వారు టార్గెట్ చేయడం కలకలం రేపుతోంది. దీంతో అడ్డుకట్టకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నేరగాళ్ల మూలాలను కనిపెట్టి కట్టడి చేస్తున్నారు. ఈక్రమంలోనే రెండు కేసుల్లో ఏడుగురి నేరగాళ్లను అరెస్ట్ చేస్తే..కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
99074 33363 నుంచి ఫోన్ చేసి ..
గతేడాది సెప్టెంబర్‌లో 82 ఏళ్ల రిటైర్డ్ ఇంజినీర్‌ను సైబర్ నేరగాళ్లు పథకం ప్రకారం.. డిజిటల్ అరెస్టు చేసి అతడి వద్ద నుంచి రూ.1.38 కోట్లను తమ అకౌంట్లలలోకి బదిలీ చేయించుకున్నారు. సైబర్ నేరగాడు 99074 33363 నుంచి ఫోన్ చేసి ఎస్బీఐ ప్రతినిధిగా చెప్పుకున్నాడు. ‘మీపై యాంటీ మనీల్యాండరింగ్ కేసు నమోదైంది. మీరు వెంటనే ముంబాయిలోని సైబర్ క్రైం ఆఫీసర్‌తో వాట్సాప్ నంబర్ 9912150357 ద్వారా మాట్లాడండి’ అని చెప్పాడు. బాధితుడు ఆ నంబర్‌కు ఫోన్ చేయగా అవతలి వ్యక్తి భయపెట్టడంతో రూ.1.38 కోట్లను సైబర్‌నేరగాళ్ల అకౌంట్లకు బదిలీ చేశాడు. తర్వాత మోసపోయానని గుర్తించిన బాధితుడు గతేడాది సెప్టెంబర్‌లో సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు మొదలు పెట్టారు. నగదు బదిలీ అయిన బ్యాంకు అకౌంట్లను పరిశీలించగా అవి తమిళనాడుకు చెందిన శంకర్ గణేష్(46)కు చెందినవి గుర్తించారు. అతడికి ఇ.సత్యవేల్ (45)తో పాటు జెస్మిన్ మోండల్, సచిన్, ముత్తుకుమార్, సలీం సహకరించినట్లు తెలుసుకున్నారు. వారిలో ఇద్దరిని అరెస్టుచేయగా మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.
99861 59427 నుంచి మరో రిటైర్డ్ ఉద్యోగికి ఫోన్ చేసి..
జనవరి నెలలో 66 ఏళ్ల రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి నుంచి డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరించి రూ.28.68 లక్షలు బదిలీ చేయించుకున్నారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో బాధితురాలికి సైబర్ నేరగాళ్లు 99861 59427 ఫోన్ నంబరు నుంచి కాల్ చేసి మీ ఆధార్ కార్డును వినియోగించి ముంబాయిలో ఎస్బీఐ బ్యాంకు అకౌంట్ తెరిచి సుమారు రూ.3 కోట్ల మేరకు మనీ ల్యాండరింగ్ కార్యకలాపాలకు పాల్పడ్డారని బెదిరించారు. ఈకేసులో 3 నుంచి 7 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని, రూ.50లక్షల జరిమానా విధిస్తారని భయపెట్టారు. దీంతో వారికి మాటలను నమ్మిన ఆమె వారు కోరినట్లు రూ.28,68,504ను బ్యాంకు అకౌంట్లకు బదిలీ చేసింది. ఆ తర్వాత మోసపోయానని గుర్తించి సైబర్ క్రైం పోలీసులు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఈ కేసులో ఉన్న సైబర్ నేరగాళ్లు కేరళ రాష్ట్రం నుంచి ఇదంతా చేశారని గుర్తించి, అక్కడికి వెళ్లి ఇందులో పాత్రధారులైన నిందితులు హంజా (44), ముస్తఫా (50), హెన్సిలీ జోసెఫ్ (45), వి.పి.మణికందన్ (56), అసిఫ్ అలీ (34)లను అరెస్టు చేయగా, ప్రధాన నిందితుడైన బాబు పరారీలో ఉన్నాడు. కేవలం ఈ రెండు కేసుల్లోనే సుమారు 2 కోట్లను సైబర్ నేరగాళ్లు కొట్టేస్తే.. గత ఏడాదిలో 120 కోట్లకు పైగానే కొట్టేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఇవి తెలుసుకోండి.. జాగ్రత్తగా వ్యవహరించండి..
* 24 గంటల్లోనే అరెస్ట్ చేస్తామంటూ బెదిరింపు నోటీసు పంపిస్తే అస్సలు నమొద్దు. అది స్కామ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నిజమైన దర్యాప్తు సంస్థలు అరెస్టులకు సంబంధించి అవసరమైన ప్రక్రియలను కచ్చితంగా అనుసరిస్తాయి. ఈ విధంగా వెంటనే అరెస్ట్ చేస్తున్నామంటూ బెదిరించవు.
* బాధితులను భయపెట్టడానికి, గందరగోళానికి గురిచేయడానికి స్కామర్లు పంపించే నోటీసుల్లో అర్థం కాని సంక్లిష్టమైన పదప్రయోగం ఉంటుంది. ఫేక్ నోటీసుల్లో పేర్కొన చట్టాలు, నిబంధనలను కూడా అర్థం చేసుకోలేని విధంగా ఉంటాయి. నిజమైన చట్టపర నోటీసులు సాధారణంగా చాలా స్పష్టంగా, సంక్షిప్తంగా అర్థం చేసుకోవడానికి సులువుగా ఉంటాయి.
* నిజమైన అధికారిక నోటీసుల్లో చక్కగా డిజైన్ చేసిన స్టాంపులు, లోగోలు కనిపిస్తాయి. అయితే అందుకు విరుద్ధంగా ఫేక్ నోటీసుల్లో కనిపించే స్టాంపులు స్పష్టంగా కనిపించవు. అందులో ఉన్న లోగో ఏంటో కూడా గుర్తించలేనట్టుగా కనిపిస్తుంది. ఇలాంటి వాటిని మోసపూరితంగా భావించవచ్చు.
* చట్టబద్ధమైన నోటీసులపై సాధారణంగా అధికారుల డిజిటల్ సంతకాలు లేదా స్వయంగా చేతితో చేసిన సంతకాలు కనిపిస్తాయి. కానీ ఫేక్ నోటీసుల్లో అస్పష్టమైన సంతకాలు, వృత్తికి తగినట్టుగా కాకుండా అనుమానాస్పదంగా ఉంటాయి.
* నిజమైన నోటీసులను గుర్తించడానికి, వాటి ప్రామాణికతను నిర్ధారించుకోవడానికి వాటి కింద సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు లేదా ఈ-మెయిల్ ఐడీ ఉంటాయి. వీటి ద్వారా తదుపరి సమాచారాన్ని పొందవచ్చు. అయితే ఫేక్ నోటీసుల్లో స్కామర్లు సంప్రదింపుల కోసం సమాచారం ఇవ్వరు.
* నిజమైన దర్యాప్తు సంస్థలకు చెందిన అధికారులు ఎవరినీ వ్యక్తిగతంగా కించపరుస్తూ మాట్లాడరు. బహిరంగంగా దూషిస్తూ బెదిరించరు. అయితే డిజిటల్ అరెస్ట్ వంటి మోసాల్లో కేటుగాళ్లు ఇలాంటి పద్ధతులను అవలంభిస్తుంటారు.
……………………………………………..