
* కాసుల కోసం సంతానం “సృష్టి”
* వేరే వాడి వీర్యంతో భార్యకు సంతానం
* సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ నిర్వాకం
* ఫెర్టిలిటీ సెంటర్ల దారుణాలు
* మరోసారి వెలుగులోకి..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఆదాయం కోసం అడ్డదారుల్లో అద్దె గర్భాలతో వ్యాపారం చేయడమే కాదు.. వీర్యకణాలను కూడా ఇష్టం వచ్చినట్లు వినియోగిస్తారన్న అంశం వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. కొన్ని టెస్ట్ ట్యూబ్ బేటీ సెంటర్ల నిర్వాహకులు పిల్లలు కావాలనే దంపతుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. ఘోరాతి ఘోరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా హైదరాబాద్‌లో వెలుగు చూసింది. ఐవీఎఫ్ కోసం టెస్ట్ ట్యూబ్ సెంటర్‌కు దంపతులు వెళ్లగా, ఆ మహిళ భర్తవి కాకుండా మరో వ్యక్తి నుంచి వీర్యకణాలు సేకరించి, ఐవీఎఫ్ పద్ధతిలో ఆస్పత్రి సిబ్బంది పిండాన్ని అభివృద్ధి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.
తల్లి అయింది కానీ..
ఆ దంపతులకు పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా సంతానం కలగలేదు. సంతానం లేక ఆమె కుంగిపోతోంది. అన్ని రకాల మందులనూ వాడిన ఫలితం లేకపోయింది. ఇక సాధారణ చికిత్స ద్వారా కాకుండా, వైద్యులు ఐవీఎఫ్ సూచించారు. దీంతో వారు సికింద్రాబాద్ లోని సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ను ఆశ్రయించారు. సెంటర్ నిర్వాహకులు ఆమె భర్త వీర్యాన్నిసేకరించారు. కొన్నాళ్లకు ఐవీఎఫ్ విధానంలో మహిళ గర్భం దాల్చింది. ఇటీవల మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే, ఆ బాలుడు తరచూ అనారోగ్యం పాలవుతుండటంతో వైద్య పరీక్షలు నిర్వహించగా క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. దీంతో ఆ తల్లి గుండెపగిలిపోయింది. దంపతులు ఇద్దరూ తల్లడిల్లిపోయారు..
వంశంలో ఎవరికీ క్యాన్సర్ చరిత్ర లేకపోవడంతో..
దంపతులిద్దరి కుటుంబాల చరిత్రలో ఎవరికీ క్యాన్సర్ లేదు. దీంతో అనుమానం వచ్చి మరోసారి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌ను ఆశ్రయించగా వాళ్లు పొంతనలేని సమాధానం చెప్పారు. దీంతో డీఎన్ ఏ టెస్ట్ కు వెళ్లారు. పుట్టిన బిడ్డ తమ డీఎన్ ఏతో సంబంధం లేదని తేలడంతో దంపతులు నిర్ఘాంతపోయారు. మహిళ భర్త నుండి కాకుండా మరో వ్యక్తి నుండి వీర్యకణాలు సేకరించి పిండాన్ని వృద్ధి చేసినట్లు డీఎన్ఏ టెస్టులో బయటపడింది. తమ డీఎన్ఏతో పుట్టిన బిడ్డ కాదని తేలడంతో వారు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో సంబంధిత సెంటర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇలాంటి “సృష్టి” లు ఇంకెన్నో..
సికింద్రాబాద్ సృష్టి కేంద్రంపై ఫిర్యాదు రావడం.. తన భర్త వీర్యం కాకుండా, వేరొకరితో వీర్యంతో సంతానాన్ని కలిగించారని దంపతుల ఆరోపణలతో ఆ కేంద్రం పనితీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో పోలీసులు, వైద్యాధికారులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ జిల్లా వైద్య అధికారులు ఈ అంశంపై లోతుగా సమగ్రంగా విచారణ చేస్తున్నారు. ఫెర్టిలిటీ క్లినిక్‌కు అనుమతులు ఉన్నాయా లేదా అనే అంశంపై కూడా దర్యాప్తు జరుగుతోంది. ఐవీఎఫ్ ద్వారా బిడ్డలను పొందాలనే మహిళల్లో ఆందోళన కలిగించేలా ఈ ఘటన కలకలం రేపుతోంది. కాసుల కోసం ఇలాంటి సృష్టిలు ఇంకెన్ని ఉన్నాయో అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.
సంతానోత్పత్తి కేంద్రాల్లో మోసాలు ఇలా..
సాధారణంగా కొంతమంది వైద్యులు తమ సొంత స్పెర్మ్ లేదా గుడ్లను ఉపయోగించి రోగులకు తెలియకుండానే గర్భం ధరించేలా చేస్తారు. ఇలాంటి మోసాలు గతంలో వెలుగులోకి వచ్చాయి. మరికొందరు అవసరం లేకపోయినా, అధిక మొత్తంలో చికిత్సలు సూచించి, రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తారు. కొన్ని క్లినిక్‌లు విజయవంతమైన గర్భధారణకు హామీ ఇస్తామని, కానీ అది జరగకపోవచ్చని తెలుసుకుని, తప్పుడు హామీలు ఇస్తూ రోగులను మోసం చేస్తారు. చికిత్స ప్రారంభంలో, కొన్ని క్లినిక్‌లు మొత్తం ఖర్చులను చెప్పకుండా, చికిత్స మధ్యలో అదనపు ఛార్జీలను విధిస్తాయి. మరికొందరు వేరొకరి అద్దె గర్భాలతో దందా నిర్వహిస్తారు. ఇదే తరహా దందా చేస్తున్న సాయికిరణ్ ఇన్ పెర్టిలిటీ సెంటర్ ను గతంలో అధికారులు సీజ్ చేశారు. పిల్లల కోసం ఇలాంటి కేంద్రాలను సంప్రదించే దంపతులు పూర్తి స్థాయిలో విచారణ చేసుకోవాలని, ఆయా సెంటర్లకు అనుమతి ఉందా లేదా అనేది కూడా పరిశీలించాలని అధికారులు సూచిస్తున్నారు.
…………………………………………………