* కేసీఆర్ రిట్ పిటిషన్‌పై హైకోర్టు ప్రశ్న
* రేపటికి విచారణ వాయిదా
ఆకేరున్యూస్, హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పవర్ కమిషన్ ను సవాల్ చేస్తూ తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (KCR) వేసిన రిట్ పిటిషన్‌పై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఈఆర్సీ ఇచ్చిన తీర్పు ప్రకారమే ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేశామన్న పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టుకు (High Court) తెలిపారు. ఈఆర్సీ ఇచ్చిన తీర్పులపై జ్యుడిషియల్ కమిషన్ వేసి ఎంక్వైరీ చేయకూడదని తెలిసినా.. కమిషన్ వేశారని కోర్టుకు దృష్టికి తెచ్చారు. దీంతో విచారణ సందర్భంగా జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీ చేస్తే తప్పేంటని పిటిషనర్ తరఫు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాక.. దానిపై చర్చించవచ్చు కదా అని కోర్టు పేర్కొంది. అయితే.. మాజీ సీఎం కేసీఆర్‌ను ఈనెల 15లోపు రిప్లై ఇవ్వాలని జ్యుడిషియల్ కమిషన్ నోటీసులు పంపిందని, కేసీఆర్ నోటీసులకు రిప్లై ఇచ్చేలోపే ఈనెల 11న జస్టిస్ నర్సింహరెడ్డి (Justice Narasimha Reddy) ప్రెస్ మీట్ పెట్టి గత ప్రభుత్వం తప్పులు చేసినట్లు తెలిపారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. కేసీఆర్‌ను టార్గెట్ చేస్తున్నట్లుగా ప్రెస్ మీట్లో జస్టిస్ నర్సింహారెడ్డి మాట్లాడారని, . భద్రాద్రి ప్రాజెక్ట్ సబ్ క్రిటికల్ ప్రాజెక్ట్ కింద నిర్మాణం చేశామని తప్పుబడుతున్నారు. దేశ వ్యాప్తంగా చాలా ప్రాజెక్టులు సబ్ క్రిటికల్ మోడ్‌లోనే నిర్మించారని కోర్టుకు తెలిపారు. పిటిషన్ర్ తరఫు న్యాయవాది వాదనలు విన్న హైకోర్టు ఈ పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేసింది.
—————-