హోలీ పండుగకు మోదుగు పూలకు ..
ఎలాంటి సంబంధం ఉందో తెలుసా..?
ఆకేరు న్యూస్, వరంగల్ :
హోలీ పండుగ .. సంబురాల జాతర. ప్రతీ ఏటా భారత దేశంలోని హిందువులంతా ఆనందంగా జరుపుకుంటారు. హోలీ (Holi Festival ) అనేది రంగుల పండుగ, వసంత కాలంలో వచ్చే ఈ పండుగను భారతదేశంలోనే కాకుండా, నేపాల్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లోనే కాకుండా అన్ని దేశాల్లోని హిందువులు ఆడంబరంగా జరుపుకుంటారు. ఆడతారు, పాడతారు. వీధులన్నీ రంగుల హరివిల్లవుతాయి. పండుగ వచ్చిందంటే చాలు రకరకాల , రంగులు వీధుల్లో నిండి పోతాయి. ఈ హోలీ పండుగ ఎన్నో ఏళ్ళుగా భారత దేశ సంప్రదాయంగా వస్తోంది.
ఈ హోలీ పండుగకు అడవికే ఆకర్షణగా నిలిచే మోదుగు పూలకు ఎంతో అనుబంధం ఉంది. కాలక్రమంలో రసాయనాల రంగుల ( Chemical Colours ) మద్య మోదుగు పూల ప్రత్యేకత మరుగునపడింది . మోదుగు పూలకు సంబంధం ఏంటో ఇప్పటి తరాలకు అర్థం కానంత అంతరాలు పెరిగిపోయాయి.
మోదుగు పూల అనుబంధం :
మోదుగు పూలు మాత్రమే కాదు, చెట్టు కూడా ఎంతో ప్రత్యేకత కలిగి ఉంటుంది. మోదుగు ఆకులను విస్తళ్ళుగా తయారు చేసి భోజనం చేసేందుకు వాడుతారు. ఇప్పటికీ ఈ విదానం పల్లెల్లో కొనసాగుతోంది. యజ్ఞ యాగాదుల్లోనూ మోదుగు కర్రలను వాడుతారు. తెలంగాణ లోని కొన్ని ప్రాంతాల్లో వీటిని ఉడక బెట్టడం ద్వారా వచ్చిన రంగును చీరలకు అద్దుతారు. దుగు పూలతో సాహితికారులకు ఎంతో ఆత్మీయ అనుబంధం ఉంటుంది. కవితలు, పాటలు , కథలు ఎన్నో మోదుగు పూల పేరుతో ప్రజలను పలకరించాయి. పల్లె పడుచులు సైతం సిగ నిండా తురుముకుని హొయలు పోయేవారని చెప్పుకుంటారు. ప్రముఖ కవి దాశరథి రంగాచార్య మోదుగు పూల పేరుతో నవల రాశారు. నిజాం ఏలుబడిలో తెలంగాణ ప్రజా జీవితానికి అద్దం పట్టింది ఆ నవల . ఆ తర్వా త రోజుల్లో సినిమాగా కూడా వచ్చింది. వేసవి కాలాన్ని ఆకు రాలు కాలం గా పిలుస్తారు. ఆకులు రాలుతాయి ..కాని పూలు మాత్రం కొమ్మలకు గుత్తులు, గుత్తులుగా అందంగా , ఆకర్షణీయంగా కనిపిస్తాయి.
హోలీ అంటే మోదుగు పూలే..
గత కాలంలో అంటే మూడు దశాబ్దాలకు ముందు కూడా హోలీ పండుగ ప్రత్యేకత మోదుగు పూలతోనే నిండి పోయేది. హోలీ పండుగకు ముందు రోజు మోదుగు పూలను ఉడక బెట్టేవారు. అందులో వచ్చిన రసాన్ని రంగుగా హోలీ పండుగలో వరుసైన వారి మీద పోసి ఆనందించే వారు. సహజ సిద్దమైన రంగు కాబట్టి ఆరోగ్యానికి ఎలాంటి నష్టం చేయదు. రసాయనాలతో నిండి పోయిన ఇప్పటి రంగుల వల్ల ఆరోగ్యానికి ఎంతో హానికరంగా మారుతోందంటున్నారు వైద్యులు .
* మోదుగు పువ్వులనే వాడేటోల్లం
వెంకటయ్య, రాంపూర్ .
మేము మోదుగు పువ్వు తెచ్చి దంచుకుని సీసాల్లో నింపి వరుసైన వారి మీద చల్లుకునేవారం. ఊర్లో కొందరు ఇంటింటికి తిరిగి హోలీ పైసలు అడుక్కునేది . వాటితోని కళ్ళు తాగేది. ఇప్పుడంటే గుడ్లు కొట్టుకుంటున్నారు . మా కాలంలో అయితే గుడ్లు దొరకక పోయేది. ఇంకా ఎడ్ల బండి చక్రా నికి ఉపయోగించే సిలిండర్ ( ఆయిల్ ) ఉండేది. దాన్ని కూడా పూసుకునేటోళ్ళం .
పేడ నీళ్లు కూడా చల్లుకొనేటోళ్ళం. మాకు ఎలాంటి రోగాలు రాకపోయేది.
* బావలు ఇచ్చిన పైసలతోని కల్లు తాగేటోళ్ళం
సదానందం, రాంపూర్.
మా రోజులలో హోలీ అంటే బొట్టు పెట్టుకోవడం ఏదో కొద్దిగా కుంకుమ పూసుకునేవాళ్ళం .
మేము మోదుగు పువ్వు తెచ్చి రంగు చేసి వరుసైన వాళ్ళ మీద పోసేటోళ్ళం . బావలు హోలికి ఇచ్చిన డబ్బులు మా తల్లిదండ్రులకు తెలియకుండా చాటుకు వెళ్ళి కల్లు తాగేటోళ్ళం. అదే గొప్ప మాకు అప్పుడు. ఇపుడయితే దారుణం కిరాణా షాప్ లోకి పోయి కేసులు, కేసులు గుడ్లు తెచ్చి కొట్టుకోవడం, అంగీలు చింపుకోవడం ఊరంతా బండ్లు వేసుకొని రోజంతా తిరగుతున్నారు. మురికి కాలువలో కూడా పండి బొర్లుతున్నరు. ఏంది ఇదంతా… పండుగంటరా దీన్ని .. ఇప్పుడు మనం చెబితే ఎవరు వింటారు. ఆ రోజులే బాగుండేది. హోలీ అంటే సంబురంగా ఓ గంటో, రెండు గంటలో ఆడుకోవాలి.
————————————-