
* సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishanreddy)కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Cm Revanthreddy) బహిరంగ లేఖ రాశారు. నిన్న ఆయన చేసిన విమర్శలకు లేఖలో బదులిచ్చారు. లేఖలో రేవంత్ ఏమన్నారంటే..
” రాష్ట్రాలకు ప్రాజెక్టుల విషయంలో కేంద్రానికి ఒక విధానం ఉంటుందని.. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అవగాహనరాహిత్యంతో మాట్లాడుతున్నారంటూ మీరు వ్యాఖ్యలు చేయడం పూర్తి బాధ్యతారాహిత్యం..అని సీఎం రేవంత్ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలో 2023 డిసెంబర్ 7న ప్రజా ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచే పూర్తి బాధ్యాయుతంగా పారదర్శకంగా మా పాలన సాగుతోంది. భారత రాజ్యాంగంలో పేర్కొన్న సమాఖ్య విధానానికి పూర్తిగా కట్టుబడి ఉండి దానిని అనుసరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ఈ క్రమంలోనే తెలంగాణ అభివృద్ధికి కీలకమైన హైదరాబాద్ మెట్రో ఫేజ్-2(Hyderabad Metro Phase-11), ప్రాంతీయ రింగ్ రోడ్డు, మూసీ పునరుజ్జీవం, రీజినల్ రింగ్ రైలు, డ్రైపోర్టు నుంచి ఏపీలోని బందరు సీ పోర్ట్‌కు గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణలకు సంబంధించి అనుమతుల సాధనకు కేంద్ర ప్రభుత్వ విధి విధానాలను పూర్తిగా పాటిస్తున్నాం. ఆయా ప్రాజెక్టుల సాధనకు సంబంధించి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులతో పాటు మిమ్మల్సి కలిసిన విషయాన్ని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను..
తెలంగాణకు జీవనాడి అయిన హైదరాబాద్ నగరంలో మెట్రో ఫేజ్-1 నిర్మాణాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government)చేపట్టింది. మెట్రోరాకతో హైదరాబాద్ నగరంలో అభివృద్ధి పరుగులు పెట్టింది. గత పదేళ్ల కాలంలో తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ ఎస్ ప్రభుత్వం మెట్రో ఫేజ్-11పై పూర్తిగా నిర్లక్ష్యం కనబరిచింది. ముఖ్యమంత్రిగా నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత మెట్రో ప్రాజెక్టుపై పూర్తి దృష్టి సారించాను. రూ. 24, 269 కోట్లతో ప్రతిపాదనలు ఆమోదించాలని నాటి కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి హర్దీప్ సింగ్ పురీకి 2024 జనవరి 4న వినతిపత్రం అందజేశాను. అక్టోబర్ 7వ తేదీన ప్రస్తుత మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు వినతిపత్రం అందజేశాను. 2024 నవంబరు నాలుగో తేదీన రాష్ట్ర ప్రభుత్వం నుంచి పట్టణ శాఖకు మెట్రో ప్రాజెక్టు ఫేజ్-11 డిటైల్ ప్రాజెక్టు రిపోర్టును సమర్పించాం. 2024 డిసెంబరు 12న ఢిల్లీలో నేను మీతో సమావేశమై హైదరాబాద్ మెట్రో ఫేజ్-11 ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను తెలియజేసి, లేఖ అందజేశాను. తాజాగా ప్రధానమంత్రిని కలిసినప్పుడు కూడా ఇదే అంశంపై లేఖ అందజేశాను.
రాష్ట్రంలో గత పదేళ్ల కాలంలో ఉన్న పాలకులు ఆర్ఆర్ఆర్ (RRR)భూ సేకరణ, టెండర్లు, అనుమతుల సాధనలో పూర్తి నిర్లక్ష్యం వహించారు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో 2024 ఫిబ్రవరి 20వ తేదీన, 2024 జూన్ 26న, 2024 డిసెంబర్ 12న సమావేశమై ఆర్ఆర్ఆర్ ప్రాధాన్యాన్ని వివరించారు. తాజాగా ప్రధాని మోడీకి ఆర్ఆర్ఆర్పై వివరించి లేఖను అందజేశాను. ఆర్ఆర్ఆర్కు సమాంతరంగా రీజినల్ రింగ్ రైలు నిర్మించాలని మీతో చర్చించడంతో పాటు ప్రధానమంత్రికి లేఖ అందజేశాను..అని” సీఎం రేవంత్ లేఖలో రాశారు.
2019 నుంచి కేంద్ర కేబినెట్లో తెలంగాణ నుంచి మీరు కొనసాగుతున్నారు. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ మంత్రి(Cabinet Minister)గా ఉన్నారు. తెలంగాణ ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రాజెక్టులకు అనుమతులు సాధించడం, నిధులు మంజూరు చేయించడం మీ నైతిక బాధ్యత. ఇదే విషయాన్ని నేను బహిరంగంగానే పలుమార్లు ప్రకటించాను. రాష్ట్రానికి నిధుల మంజూరుపై ప్రధానమంత్రిని కలిసి వినతులు అందజేయండతో పాటు మిమ్మల్ని స్వయంగా కలిసి అన్నీ వివరించిన తర్వాత కూడా అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని.. విధానాన్ని అనుసరించడం లేదని మీరు మాట్లాడటం తీవ్ర అభ్యంతరకరం..అని సీఎం విమర్శించారు.
తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్లో ఉన్న మీరు రాష్ట్రానికి చేసిందేమిటో ప్రజలకు తెలియజేయండి. తెలంగాణ ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా మేం ప్రతిపాదిస్తున్న ప్రాజెక్టులకు ఏ విధంగా చేయూతనిస్తారో చెబితే రాష్ట్ర ప్రజలు సంతోషిస్తారు. అంతేకానీ.. కేంద్ర మంత్రిగా ఉండి ఏ ఒక్కటీ సాధించలేని మీరు ఒత్తిడితో మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఎదురుదాడి చేయడం సమంజసం కాదు. ఇకనైనా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రూ.1,63,559.31 కోట్ల ప్రాజెక్టుల అనుమతులు, నిధుల మంజూరు ప్రత్యేక శ్రద్ధ వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.”అని సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖలో వెల్లడించారు.
……………………………………..