– సీఎం రేవంత్ ఆదేశాలతో హైదరాబాద్ పోలీసుల ప్రణాళికలు
– క్షేత్రస్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకు చర్చ
– తొలుత ఐటీకారిడార్‌పై దృష్టి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మహానగరం ఎంత అభివృద్ధి చెందినా.. ట్రాఫిక్ సమస్యకు మాత్రం మోక్షం కలగడం లేదు. ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, సర్వీసు రోడ్లు.. ఇలా కొత్తగా ఎన్ని వచ్చినా జంక్షన్లలో వాహనాలు బారులు తీరుతూనే ఉన్నాయి. వర్షం వచ్చినప్పుడు హైదరాబాద్‌వాసులకు మరిన్ని ఇబ్బందులు తప్పడం లేదు. కిలోమీటరు ప్రయాణానికి అరగంట పట్టిన సందర్భాలు చాలామందికి అనుభవమే. ఈనేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ట్రాఫిక్ ఇబ్బందులను గాడిన పెట్టే ప్రయత్నం చేస్తోంది. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ ట్రాఫిక్‌పై సైతం మాట్లాడారు. ట్రాఫిక్ సమస్యను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.
హై రైస్డ్ కెమెరాలు
ట్రాఫిక్ ఇక్కట్లు తొలిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఉన్నతస్థాయి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు పోలీసు ఉన్నతాధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రధానంగా తొలుత ఐటీకారిడార్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఈమేరకు ఐటీ కంపెనీల భవనాలకు హై రైజ్ కెమెరాలను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రయోగాత్మకంగా కొన్నిచోట్ల ఏర్పాటు చేశారు. 360 డిగ్రీస్ రేడియస్‌లో ఒక్కో కెమెరా కిలోమీటర్ మేర స్పష్టమైన విజువల్స్‌తో వీక్షిస్తుంది. జూమ్‌చేసి వాహనాల నంబర్లతో సహా స్పష్టంగా చూడొచ్చు. సమీప ప్రాంతాల్లో ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడినా ట్రాఫిక్ పోలీసులకు తెలిసేలా కెమెరాలను సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్ (పీఎస్ ఐవోసీ)కు అనుసంధానం చేశారు. అక్కడి నుంచి సిబ్బంది ట్రాఫిక్‌ను మానిటరింగ్ చేస్తారు. ట్రాఫిక్ జాయింట్ సీపీ సైతం పరిస్థితిని సమీక్షించేలా ఆయన కార్యాలయానికి కనెక్ట్ చేశారు.
రంగంలోకి టాస్క్ ఫోర్స్ బృందాలు
ట్రాఫిక్ ఎక్కువగా ఎక్కడ జామ్ అయింది..? ఎందుకు జామ్ అయింది..? పరిస్థితిని వీక్షించి వెంటనే ట్రాఫిక్ టాస్క్‌ఫోర్స్ బృందాలను రంగంలోకి దింపుతారు. ట్రాఫిక్ క్లియర్ చేయడానికి అవసరమైన చర్యలు చేపడతారు. అంతేకాదు.. రోజూ ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడే ప్రాంతాలను గుర్తించి అక్కడ మరోసారి సమస్యలు తతెత్తకుండా ప్రత్నామ్నాయ మార్గాలను అన్వేషిస్తారు. ఇలా ఐటీ కారిడార్‌లో గచ్చిబౌలి, బొటానికల్ గార్డెన్, రాయదుర్గం, ఐకియా, నార్సింగి, సన్‌సిటీ, రాజేంద్రనగర్, అత్తాపూర్, మాదాపూర్, మియాపూర్, చందానగర్, కేపీహెచ్‌బీ, కూకట్పల్లి, బాచుపల్లి, దుండిగల్ మొత్తం 70 ప్రాంతాల్లో హై రైజ్ కెమెరాలను ఏర్పాటు చేయడానికి ట్రాఫిక్ ఉన్నతాధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే 17 ప్రాంతాల్లో ఐటీ భవనాలకు కెమెరాలను ఇన్స్టాల్ చేసి ట్రాఫిక్‌ను కంట్రోల్ చేసేలా చర్యలు చేపట్టారు.
వానొస్తే వెతలే
గతంలో చినుకు పడిందంటే చాలు.. ఐటీ కారిడార్‌లో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు నరకం చూసేవారు. 100 మీటర్ల దూరానికే 15-20 నిమిషాలు పట్టేది. రాంగ్రూట్లు, యూటర్న్‌లతో ట్రాఫిక్ మరింత జఠిలంగా మారేది. ఇకపై అలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఈమేరకు వర్ష సూచనలు ఉన్న సమయంలో ముందుగానే ట్రాఫిక్ సిబ్బందితో పాటు.. జీహెచ్ఎంసీ సిబ్బందిని రంగంలోకి దింపుతున్నారు. ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్లోని సిబ్బంది ఐటీ కారిడార్ మొత్తాన్ని వీక్షించి ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉందో, అక్కడికి బృందాలను పంపుతున్నారు. వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. చినుకులు పడినా చింతలేదు అన్నట్లుగా ట్రాఫిక్‌ను నియంత్రించేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
…………………………………….