
* కరీంనగర్లో వినూత్న రైతుల నిరసన
ఆకేరు న్యూస్, కరీంనగర్ : తెలంగాణలో యూరియా కోసం ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. యూరియా (URIA) కష్టాలు కొనసాగుతున్నాయి. తాజాగా కరీంనగర్(KARIMNAGAR)లో వినూత్నంగా నిరసన తెలిపారు. మండలంలోని దుర్షేడులో రాజీవ్ రహదారిపై యూరియా కోసం రైతులు, మహిళా రైతులు మానవహారం నిర్వహించి, బతుకమ్మల ఆటలాడుతూ నిరసన తెలిపారు. వారి ఆందోళనలకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (MLA GANGULA KAMALAKAR) మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు యూరియా, కనీసం పొటాష్ కూడా అందుబాటులో లేని దుస్థితి వచ్చిందని విమర్శించారు. యూరియా రైతులకు దొరక్కుండా బ్లాక్ మార్కెట్కు తరలించారని ఆరోపించారు. యూరియా కోసం గ్రామాలు కదిలి రావడం, మహిళా రైతులు సైతం రోడ్డెక్కడం, బతుకమ్మ ఆడడం, దురదృష్టకరమన్నారు. రైతులకు ఏమాత్రం పంట నష్టం జరిగినా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. ఈ సందర్భంగా మహిళా రైతులు పెద్ద సంఖ్యలో వచ్చి బతుకమ్మ ఆడారు. రాజీవ్ రహదారి పూర్తిగా స్తంభించిపోయింది. జిల్లా వ్యవసాయ అధికారి రావాలని రైతులు డిమాండ్ చేశారు. యూరియా బస్తాలు చేత పట్టుకుని ప్రదర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
………………………………….