* మహిళా వ్యాపారవేత్త ఫోటోతో అకౌంటెంట్‌కు గాలం
* మాజీ డీజీపీ మనుమరాలి పేరుతో భారీ దోపిడీ
* రూ. కోటి పైగా బదిలీ చేసిన అకౌంటెంట్
* మీటింగ్‌లో ఉన్నానంటూ వాట్సాప్ మెసేజ్.. నిజమని నమ్మి రూ.1.20 కోట్లు పోగొట్టుకున్న నగర వ్యాపారవేత్త
ఆకేరు న్యూస్, హైదరాబాద్: భాగ్యనగరంలో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. సామాన్యులే కాకుండా ఉన్నత విద్యావంతులు, వ్యాపారవేత్తలను సైతం తమ మాయమాటలతో బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా నగరానికి చెందిన ఒక ప్రముఖ మహిళా వ్యాపారవేత్తను లక్ష్యంగా చేసుకున్న సైబర్ కేటుగాళ్లు, ఏకంగా రూ.1.20 కోట్లు కొల్లగొట్టారు.
అసలేం జరిగిందంటే..
బాధిత మహిళ రాష్ట్ర మాజీ డీజీపీ మనుమరాలిగా సమాచారం. ఆమె ప్రస్తుతం దాదాపు 18 కంపెనీలకు డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో, ఈ నెల 13న సైబర్ నేరగాళ్లు ఆమె ఫోటోను, పేరును వాడుకుంటూ ఒక వాట్సాప్ అకౌంట్‌ను సృష్టించారు. అనంతరం ఆమె కంపెనీలో పనిచేసే అకౌంటెంట్‌కు ఆ నంబర్ నుండి సందేశం పంపారు.
“నేను ప్రస్తుతం ఒక ముఖ్యమైన మీటింగ్‌లో ఉన్నాను.. ఫోన్ మాట్లాడలేను. అర్జెంట్‌గా నేను చెప్పిన బ్యాంక్ ఖాతాకు రూ.1.20 కోట్లు ట్రాన్స్ఫర్ చేయండి” అని ఆ మెసేజ్‌లో పేర్కొన్నారు. డీపీలో తన బాస్ ఫోటో ఉండటం, పంపిన మెసేజ్ కూడా అధికారికంగా అనిపించడంతో అకౌంటెంట్ ఏమాత్రం సందేహించలేదు. వెంటనే సదరు అకౌంట్‌కు రూ.1.20 కోట్లు బదిలీ చేశాడు.
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు:
తర్వాత తీరిగ్గా జరిగిన విషయాన్ని అకౌంటెంట్ తన బాస్‌కు వివరించగా.. ఆమె అవాక్కయ్యారు. తాను అటువంటి మెసేజ్ ఏదీ పంపలేదని చెప్పడంతో, తాము సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించారు. వెంటనే బాధితులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాల ద్వారా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
జర జాగ్రత్త!
వాట్సాప్ లేదా ఇతర సోషల్ మీడియా యాప్స్‌లో తెలిసిన వారి ఫోటోలు ఉన్నంత మాత్రాన గుడ్డిగా నమ్మకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా డబ్బు లావాదేవీల విషయంలో ఒకటికి రెండుసార్లు ఫోన్ చేసి నిర్ధారించుకోవాలని సూచిస్తున్నారు.
