Hyderabad Ganesh Immersion
* ట్యాంక్‌బండ్ వైపు తరలివచ్చిన భక్తులు..
* ప్రశాంతంగా నిమజ్జన వేడుకలు
Hyderabad Ganesh Immersion| హైదరాబాద్: జంట నగరాల్లో వినాయక నిమజ్జన వేడుకలు వైభవంగా, ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. నగరవ్యాప్తంగా పండుగ శోభ నెలకొనగా.. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులంతా ట్యాంక్‌బండ్ వైపు కదిలారు. డప్పు దరువులు, బ్యాండ్ మేళాలు, భక్తి నినాదాలతో పరిసర ప్రాంతాలు మార్మోగాయి. అధికారుల పటిష్ట పర్యవేక్షణతో నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగాయి.
680 విగ్రహాల నిమజ్జనం
సికింద్రాబాద్ జోన్ పరిధిలోని ట్యాంక్‌బండ్‌పై 12, చిల్డ్రన్స్ పార్కు సమీపంలో 3 కలిపి మొత్తం 15 క్రేన్లను ఏర్పాటు చేశారు. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సుమారు 680 వినాయక విగ్రహాలను హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేశారు. లుంబినీ పార్కు, ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డు ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి.
బాలాపూర్ గణేషుడి నిమజ్జనం
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం అనంతరం బాలాపూర్ గణేషుడి శోభాయాత్ర అప్పర్ ట్యాంక్‌బండ్‌కు చేరుకుంది. మధ్యాహ్నం 4:34 గంటలకు క్రేన్ నంబర్ 12 వద్ద ఉత్సవ కమిటీ సభ్యులు, వేలాది మంది భక్తుల సమక్షంలో బాలాపూర్ గణేషుడిని హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా భక్తులు పెద్దఎత్తున సెల్ఫీలు, వీడియోలు తీసుకున్నారు. ‘జై బోలో గణేష్ మహారాజ్ కీ జై’ నినాదాలతో పరిసరాలు మార్మోగాయి.
కట్టుదిట్టమైన భద్రత
నిమజ్జనోత్సవాల సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై క్రేన్ నంబర్ 9 వద్ద ప్రత్యేక పోలీసు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. 58 సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ప్రతి క్రేన్ వద్ద ఎస్ఐతో పాటు ఐదుగురు పోలీసు సిబ్బందిని విధుల్లో ఉంచారు. 25 టాస్క్‌ఫోర్స్ బృందాలు, 10 షీ-టీమ్‌లు భద్రతను పర్యవేక్షించాయి. తప్పిపోయిన కుటుంబ సభ్యులను కంట్రోల్ రూమ్ అనౌన్స్మెంట్ల ద్వారా వారి కుటుంబాలతో కలిపారు. జేబు దొంగతనాలు, సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ప్రభుత్వ విభాగాల సేవలు
భక్తుల కోసం వాటర్ వర్క్స్ ఆధ్వర్యంలో ఉచిత తాగునీటి శిబిరాలను ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచారు. వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి అవసరమైన వారికి మందులు అందించారు.
యువత సందడి
నిమజ్జన వేడుకల్లో యువతీయువకుల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. డప్పు దరువులు, బ్యాండ్ మేళాల మధ్య తీన్మార్ స్టెప్పులతో యువత ఉత్సాహంగా పాల్గొంది. సినిమా పాటలు, సంప్రదాయ డప్పు చప్పుళ్లకు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు భక్తులు ఉత్సాహంగా నిమజ్జన వేడుకలను తిలకించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
