Hyderabad emerging as Global Medical Hub
* హైదరాబాద్ కు ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి రోగులు
* నిష్ణాతులైన వైద్యులు.. తక్కువ ధరకే చికిత్సే కారణం
* ఒక్కో ప్రముఖ ఆస్పత్రికి ఏటా 2వేల మంది విదేశీయులు
* కీళ్ల మార్పిడి.. వెన్నెముక సర్జరీలకే ఎక్కువ మంది..
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ :
హైదరాబాద్ మహా నగరం ప్రపంచానికే వైద్య రాజధానిగా మారింది. ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ దేశాలతో పాటు ఇతర దేశాల నుంచి కూడా చికిత్స కోసం ఇక్కడకు ఏటా వేలాది మంది తరలివస్తున్నారు. ఒకప్పుడు ఏదైనా తీవ్రమైన అనారోగ్య సమస్య వచ్చినా, గుండె శస్త్ర చికిత్సల కోసమైనా దేశంలోని ప్రముఖులు అమెరికా, ఐరోపా వంటి ఇతర దేశాలకు వెళ్లేవారు. ఇప్పుడు సీన్ మారింది. వైద్య చికిత్స కోసం విదేశాల నుంచే ఇక్కడకు వస్తున్నారు. ఇక్కడ నిష్ణాతులైన వైద్యులు ఉండడంతో పాటు అతి తక్కువ ధరకే చికిత్సలు అందుబాటులో ఉండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. వైద్య శాఖ గణాంకాల ప్రకారం.. ఒక్కో ప్రముఖ ఆస్పత్రిలో ఏటా సుమారు 2వేల మంది విదేశీ రోగులు అడ్మిట్ అవుతున్నారంటే వైద్యపరంగా హైదరాబాద్‌లో ఏస్థాయిలో అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు.
* ఫారిన్ టు హైదరాబాద్ సిటీ..
హైదరాబాద్ మహానగరంలో అపోలో, యశోద, కిమ్స్, కేర్, మెడికవర్, ఏఐజి వంటి ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నాయి. ఆయా ఆస్పత్రులు అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య సేవలను అందిస్తున్నాయి. తక్కువ ఖర్చులో నాణ్యమైన వైద్య సేవలను అందిస్తూ విదేశీ రోగులను హైదరాబాద్ వైపు ఆకర్షిస్తున్నాయి. రోబోటిక్ సర్జరీలు, అవయవ మార్పిడి, అడ్వాన్స్డ్ ఆంకాలజీ (క్యాన్సర్ చికిత్స), ప్రోటాన్ థెరపీ వంటి అధునాతన వైద్య విధానాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ప్రసిద్ధ వైద్య విభాగాలు: కార్డియాలజీ (గుండె చికిత్స), ఆర్థోపెడిక్స్ (కీళ్ల మార్పిడి), గ్యాస్ట్రోఎంటరాలజీ, న్యూరాలజీ మరియు కాస్మోటిక్ సర్జరీలలో హైదరాబాద్ అంతర్జాతీయంగా పేరు గాంచింది.
* వైద్య ఖర్చుల్లో భారీ వ్యత్యాసం
యూఎస్, యూకే వంటి పాశ్చాత్య దేశాలు, మిడిల్ ఈస్ట్ దేశాలతో పోలిస్తే హైదరాబాద్ లో వైద్య ఖర్చులు సగానికి సగం తక్కువ ఉన్నాయి. కొన్ని చికిత్సలకు అయితే 50 శాతం నుంచి 80 శాతం వరకు తక్కువ అని వైద్యులు చెబుతున్నారు. దీంతో మిడిల్ ఈస్ట్ – ఆఫ్రికన్ దేశాల నుంచి ఇక్కడకు వస్తున్న రోగులు ఎక్కువగా ఉంటున్నారు. ప్రధానంగా క్యాన్సర్ చికిత్స, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్, ఓపెన్ హార్ట్ సర్జరీలు, నరాల సమస్యలు. మిడిల్ ఈస్ట్ / అరబ్ దేశాలు (ఒమన్, యెమెన్, ఇరాక్, యూఏఈ)తమ దేశాల్లో అత్యంత ఖరీదైన వైద్యం ఉండటం వల్ల ఇక్కడికి వస్తారు.
* ఉదాహరణకు కొన్ని చికిత్సలు ఇలా..
మిడిల్ ఈస్ట్, అమెరికా వంటి దేశాల్లో బైపాస్ సర్జరీకి 30 లక్షల నుంచి 50 లక్షలకు పైగా అవుతుంటే, హైదరాబాద్‌లో కేవలం రూ.5 లక్షల నుంచి కొన్ని క్లిష్ట సర్జీరీలకు 10 లక్షల వరకు మాత్రమే అవుతుండడం గమనార్హం. విదేశాల్లో వెన్నెముకకు శస్త్ర చికిత్స చేసుకుంటే ఎంత లేదన్న రూ.40 లక్షలు అవుతుంది. హైదరాబాద్‌లో కేవలం రూ.2లక్షలతో పూర్తి చేయగలమని వైద్యులు తెలిపారు. కీళ్ల మార్పిడికి విదేశాల్లో రూ.15లక్షలు ఖర్చు అవుతుంటే ఇక్కడ లక్షన్నర నుంచి రెండు లక్షలకు మించి ఉండదన్నారు. విదేశాల్లో బైపాస్ సర్జరీకి రూ.15లక్షలకు మించి వ్యయం అవుతుందని, ఇక్కడైతే రెండు నుంచి నాలుగు లక్షల రూపాయల్లో పూర్తవుతుందని వైద్యులు వివరిస్తున్నారు. సంతానలేమి (ఐవిఎఫ్) చికిత్స కోసం విదేశాల్లో సుమారు 10 లక్షలకు పైగా అవుతుంటే.., హైదరాబాద్ లో రూ.2.5 లక్షల నుంచే అందుబాటులో ఉండడం గమనార్హం.
* మిడిల్ ఈస్ట్ దేశాలునుంచి ఎక్కువ మంది
మరోవైపు, హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న శస్త్ర చికిత్సల్లో సక్సెస్ రేటు ఎక్కువగా ఉంటోందని చెప్పారు. ‘‘క్లిష్టమైన వ్యాధులకు హైదరాబాద్‌లో చికిత్సలు చేసి నయం చేసిన కేసులు అనేకం ఉన్నాయి. ఇక్కడి వైద్యులు రోగులతో ఎక్కువ సమయం గడుపుతారు. దీని వల్ల రోగుల్లో ఒక నమ్మకం ఏర్పడుతుంది’’ అని వివరించారు. ఉగాండా, నైజీరియా, టాంజానియా, మెజాంబిక్, కెన్యా, దుబాయ్, సౌదీ అరేబియా, శ్రీలంక, బంగ్లాదేశ్ మాల్దీవుల నుంచి ఎక్కువ మంది హైదరాబాద్‌కు చికిత్స కోసం వస్తున్నారు. కార్పొరేట్, సూపర్‌స్పెషాల్టీ ఆస్పత్రుల్లో విదేశీ రోగుల తాకిడి ఎక్కువగా ఉంది. ఒక్కొక్క కార్పొరేట్ ఆస్పత్రిలో ఏడాదిలో కనీసం 2వేల మంది విదేశీ రోగులు అడ్మిట్ అవుతున్నట్లు అంచనా.
* ట్రాన్స్ లేటర్స్.. విమాన సౌకర్యాలు
ఇతర దేశాల నుంచి హైదరాబాద్ కు చికిత్స నిమిత్తం వచ్చే రోగుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రముఖ ఆస్పత్రులన్నీ ట్రాన్స్‌లేటర్లను కూడా నియమిస్తున్నాయి. ఇంగ్లిషుతో పాటు అరబిక్, ఫ్రెంచ్ భాషలు మాట్లాడే ట్రాన్స్‌లేటర్లను ఆసుపత్రులు అందుబాటులో ఉంచుతున్నాయి. అలాగే శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా మిడిల్ ఈస్ట్ మరియు ఆఫ్రికన్ దేశాలకు నేరుగా విమాన సౌకర్యాలు ఉన్నాయి. ఇవన్నీ ఇతర దేశాల రోగులు హైదరాబాద్‌కు క్యూ కట్టేందుకు కారణమవుతున్నాయి. విదేశాల నుంచి చికిత్స కోసం వచ్చే రోగుల విషయంలో భారతప్రభుత్వం అన్ని దేశాల్లోని రాయబార కార్యాలయాల్లో ఒకే తరహా నిబంధనలు అమలు చేస్తూ, వీసాలు సులభంగా దొరికేలా చేస్తే.. వైద్యం కోసం భారత్‌కు వచ్చేవారి సంఖ్య ఇంకా పెరుగుతుందని మెడికవర్ హాస్పిటల్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీ హరికృష్ణ ఓ సందర్భంలో వెల్లడించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
