Hyderabad Crime News
* పేట్రేగుతున్న కిడ్నాప్ ముఠాలు
* భయబ్రాంతుల్లో కాలనీల్లో ప్రజలు
* బొల్లారం ఘటనతో ఉలిక్కిపడ్డ నగరం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాజధాని హైదరాబాద్ లో వరుస కిడ్నాప్ ఘటనలు.. హత్యలు భయాందోళనలకు గురిచేస్తున్నాయి. కేవలం డబ్బు పిచ్చి, పాత కక్షలతో రాత్రికి రాత్రే చిన్నారులను, వ్యాపారులను ఎత్తుకెళ్తున్న కిడ్నాపర్లు.. వారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఏమాత్రం ఆలస్యమైనా లేదా పోలీసులకు సమాచారం ఇచ్చినా బాధితులను దారుణంగా హతమార్చేందుకు వెనుకాడడం లేదు.
తాజాగా బొల్లారంలో ఐదేళ్ల చిన్నారి దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. మరో ఘటనలో వ్యాపారి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేయకుండా, కిడ్నాపర్లకు రూ.కోటి ఇచ్చి విడిపించుకుంది. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. కేవలం రోజుల వ్యవధిలోనే వరుస ఘటనలు పోలీసులకు సైతం సవాలు విసురుతున్నాయి.
* కక్షతో చిన్నారిని చిదిమేసిన సెక్యూరిటీ గార్డు
ఇటీవల బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఐదేళ్ల చిన్నారి అరేలియా కిడ్నాప్.. హత్య ఉదంతం ప్రతి ఒక్కరినీ కదిలించింది. బతుకుదెరువు కోసం బిహార్ నుంచి హైదరాబాద్ వచ్చిన విక్రమ్ సెక్యూరిటీ గార్డుగా విధుల్లో చేరాడు. ప్రవర్తన సరిగా లేకపోవడంతో అతడిని విధుల నుంచి తొలగించారు. అయితే ఆ కుటుంబ పెద్దపై పెంచుకున్న వ్యక్తిగత కక్షను మనసులో ఉంచుకొని, శనివారం రాత్రి అపాపినెరుగని ఐదేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత ఏమాత్రం కనికరం లేకుండా పాపను దారుణంగా హత్య చేసి తన పగ తీర్చుకున్నాడు.
* బంగారం వ్యాపారి కిడ్నాప్.. రూ.1.5 కోట్ల డిమాండ్
నాలుగు రోజుల క్రితం రాంనగర్ పరిధిలో ప్రముఖ బంగారం వ్యాపారి శ్రీనివాస్ కిడ్నాప్ కావడం నగరంలో పెద్ద సంచలనంగా మారింది. అతడిని కిడ్నాప్ చేసిన దుండగులు పోలీసులకు దొరక్కుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వర్చువల్ కాల్స్ ద్వారా కుటుంబ సభ్యులకు ఫోన్లు చేశారు. పోలీసులకు చెప్తే ప్రాణాలు తీస్తామని బెదిరిస్తూ ఏకంగా రూ.1.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పోలీసులకు విషయం తెలిసిందన్న అనుమానంతో కిడ్నాపర్లు శ్రీనివాస్‌ను కర్నూలుకు తరలించారు. చివరికి పోలీసుల ప్రమేయం లేకుండా కుటుంబ సభ్యులే రహస్యంగా డబ్బులు ముట్టజెప్పి వ్యాపారిని రక్షించుకున్నారు. ఇంటికి సురక్షితంగా చేరుకున్న బాధితుడు ఇచ్చిన వివరాల ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు, కిడ్నాప్ ముఠాలోని ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
* మేడ్చల్‌లో మార్వాడీ వ్యాపారి హత్య
వారం రోజుల క్రితం పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఓ మార్వాడీ వ్యాపారి హఠాత్తుగా మాయమయ్యాడు. ఇంట్లోంచి బయటకు వెళ్లిన వ్యక్తి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసు నమోదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు. అయితే, రెండు రోజుల వ్యవధిలోనే మేడ్చల్ సమీపంలో సదరు వ్యాపారి శవమై కనిపించడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
దుండగులు అతడిని కారులో కిడ్నాప్ చేసి తీసుకెళ్లి దారుణంగా హత్య చేసి పడేశారని పోలీసులు, బాధితుడి కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. అయితే అతడిని ఎవరు తీసుకెళ్లారు, ఆర్థిక లావాదేవీల వల్ల చంపారా లేక మరేదైనా పాత కక్షలు ఉన్నాయా అనే విషయాలు ఇంకా స్పష్టమవ్వలేదు.
* జగద్గిరిగుట్టలో పట్టపగలే దాడి, కిడ్నాప్
నగరంలో నేరగాళ్ల తెగింపు ఎంతవరకు వెళ్లిందంటే జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజులరామారంలో పట్టపగలే ఒక వ్యాపారిపై దాడి చేసి కిడ్నాప్‌కు పాల్పడ్డారు. బాధితుడైన అశోక్‌రెడ్డిని కొందరు దుండగులు వాహనంలో ఎత్తుకెళ్లి చితకబాదారు.
ఆ తర్వాత ఆయన వద్ద దౌర్జన్యంగా ఖాళీ బాండ్ పేపర్లపై సంతకాలు చేయించుకుని, తీవ్రంగా గాయపరిచి రోడ్డుపై వదిలేసి పరారయ్యారు. ఈ దారుణ ఘటనపై బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, ఐదు రోజులు గడిచినా నిందితుల ఆచూకీ లభించకపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
* పనివాళ్లుగా చేరి..
కొన్ని నేరపూరిత ముఠాలు కేవలం దొంగతనాలు, దోపిడీల కోసమే హైదరాబాద్ నగరంలోకి ప్రవేశిస్తున్నట్లు వరుస ఘటనల ఆధారంగా తెలుస్తోంది. పోలీసుల కంటపడకుండా రహస్యంగా గుట్టుగా తలదాచుకుంటూ తమ పని ముగించుకుని తిరిగి పారిపోతున్నాయి. కొందరు పని కోసం అంటూ ఇళ్లలో చేరి.. అదును చూసి అందినంతా దోచుకుంటున్నారు.
యజమానులు ఎదురుతిరిగితే హత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఈ క్రమంలో అసలైన కార్మికులు ఎవరు, నేరస్థులు ఎవరు అనేది గుర్తించడం పోలీసులకు సవాలుగా మారుతోంది. ఈ తీవ్రతను గమనించిన సైబరాబాద్ సీపీ ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టారు. ఏజెంట్లు, దళారులు, నిర్మాణ సంస్థలు, పరిశ్రమల యజమానులు రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులతో సంయుక్త సమావేశాలు ఏర్పాటు చేసి, ప్రతీ వలస కార్మికుడికి ఐడెంటిటీ కార్డులు ఉండేలా పక్కాగా లెక్కలు తేలుస్తున్నారు.
* పోలీసుల హెచ్చరికలు..
వరుస ఘటనలో నేపథ్యంలో ట్రై పోలీస్ కమిషనరేట్ల పోలీసులు అప్రమత్తం అయ్యారు. నిఘాను కట్టుదిట్టం చేయడంతో పాటు పౌరులకు పలు సూచనలు చేస్తున్నారు. కిడ్నాపర్లు లేదా బెదిరింపులకు పాల్పడే నిందితులు పోలీసులకు చెబితే చంపేస్తామని హెచ్చరించినా, ఏమాత్రం భయపడకుండా వెంటనే డైల్ 100 కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని, రహస్యంగా డబ్బులు చెల్లిస్తే నేరస్థులకు మరింత ధైర్యం ఇచ్చినట్లవుతుందని పేర్కొంటున్నారు.
పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు నిర్వహించే బంగారం, వస్త్ర ఇతర వ్యాపారులు అనుమానిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. వీడియో కాల్స్ లేదా వర్చువల్ కాల్స్ ద్వారా కుటుంబ సభ్యులను బందీలుగా చూపించి డబ్బు డిమాండ్ చేసే మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. సైబర్ నేరగాళ్లు లేదా కిడ్నాపర్లు ఫోన్ చేసిన వెంటనే కుటుంబ సభ్యులు ఆందోళనకు గురికాకుండా పోలీసులను ఆశ్రయించాలన్నారు.
* పనివాళ్లు ఆధారాలు తీసుకోండి..
వ్యాపార సంస్థలు, ఫ్యాక్టరీలు, నిర్మాణ రంగాలు, గృహాల యజమానులు తమ వద్ద పనికి కుదిరే సెక్యూరిటీ గార్డులు, వలస కార్మికులు లేదా డ్రైవర్ల పూర్తి వివరాలు తెలుసుకోవాలని, వారి నుంచి ఆధారాలు కూడా సేకరించాలని మల్కాజిగిరి సీపీ సుమతి సూచిస్తున్నారు.
అపార్ట్మెంట్లు, వ్యాపార సముదాయాలు, కాలనీ సంక్షేమ సంఘాలు తమ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు. వ్యాపారులు, వారి కుటుంబ సభ్యులు తమ ఆర్థిక స్థోమత, దైనందిన కదలికలు, ప్రయాణాలకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో బహిరంగంగా పోస్ట్ చేయకపోవడం ఉత్తమమన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

