*బీర్ బాటిల్లో చేప పిల్ల..
ఆకేరు న్యూస్, హైదరాబాద్: మందుబాబులకు ఊహించని షాక్ తగిలింది. సాధారణంగా బీర్ బాటిల్లో ఏవైనా నలకలు లేదా ఇతర పదార్థాలు రావడం చూస్తుంటాం, కానీ ఏకంగా ఒక చేప పిల్ల ఈత కొడుతూ కనిపించడం ఇప్పుడు నగరంలో సంచలనంగా మారింది.
అసలేం జరిగిందంటే..
హైదరాబాద్‌లోని నాచారం పరిధిలో ఉన్న మల్లాపూర్‌లోని ‘జేపీ వైన్ షాపు’లో ఈ వింత ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం నాడు ఒక వ్యక్తి ఈ వైన్ షాపులో ‘కింగ్‌ఫిషర్ లైట్’ బీర్ బాటిల్‌ను కొనుగోలు చేశాడు. అయితే, బీర్ తాగేందుకు బాటిల్ మూత తీయగానే, అందులో ఏదో కదులుతున్నట్లు గమనించాడు. నిశితంగా పరిశీలించగా, ఆ సీల్డ్ బీర్ బాటిల్ లోపల ఒక చిన్న చేప పిల్ల ఈత కొడుతూ కనిపించింది.
నిర్వాహకుల నిర్లక్ష్యం:
దీంతో అవాక్కయిన సదరు కస్టమర్ వెంటనే వైన్ షాపు నిర్వాహకులను ప్రశ్నించాడు. అయితే, వారు బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇచ్చారు. బీరు తాము తయారు చేయలేదని, ఏవైనా లోపాలు ఉంటే తయారు చేసిన కంపెనీని అడగాలని దురుసుగా ప్రవర్తించారు. నిర్వాహకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితుడు, బీర్ బాటిల్లో చేప పిల్ల ఉన్న దృశ్యాలను తన ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ప్రముఖ కంపెనీల బీర్ బాటిళ్లలోనే ఇలాంటివి వస్తుంటే, ఇక సామాన్యుల ఆరోగ్యం పరిస్థితి ఏమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు దీనిపై స్పందించి సదరు వైన్ షాపు మరియు తయారీ కంపెనీపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
