Hyderabad Drug Seizure
* బీదర్ నుంచి హైదరాబాద్‌కు అక్రమ రవాణా
* 300 నైట్రో-విట్ టాబ్లెట్లు స్వాధీనం
Hyderabad Drug Seizure| ఆకేరు న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మత్తు పదార్థాల అక్రమ రవాణాపై పోలీసులు మరోసారి కొరడా ఝుళిపించారు. నగరంలోని మల్లేపల్లి ప్రాంతంలో ఈగల్ టీమ్, హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (H-NEW) అధికారులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో మత్తు టాబ్లెట్ల అక్రమ విక్రయాల గుట్టురట్టైంది. ఈ ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, సుమారు 300 నైట్రో-విట్ (Nitro-Vit) టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
మల్లేపల్లిలో దాడులు
హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లేపల్లిలో విశ్వసనీయ సమాచారం మేరకు అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ దాడుల్లో ఉప్పాడ ప్రసాద్, సమీరా బేగం అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి మత్తు టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.
మరో ప్రత్యేక ఆపరేషన్‌లో పల్లవి, సూర్యధరణ్ అనే మరో ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. నలుగురి నుంచి మొబైల్ ఫోన్లు, ఇతర కీలక ఆధారాలను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.
బీదర్ నుంచి సరఫరా
ప్రాథమిక విచారణలో కర్ణాటకలోని బీదర్ ప్రాంతం నుంచి తక్కువ ధరకు మత్తు టాబ్లెట్లను కొనుగోలు చేసి హైదరాబాద్‌కు తీసుకొస్తున్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. నగరంలోని యువత, కళాశాల విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు అనుమానిస్తున్నారు.
గంజాయికి ప్రత్యామ్నాయంగా..
నగరంలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసులు నిఘా పెంచడంతో అక్రమ వ్యాపారులు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. గంజాయికి ప్రత్యామ్నాయంగా మత్తు టాబ్లెట్ల విక్రయాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది.
నెట్‌వర్క్‌పై పోలీసుల ఆరా
మత్తు టాబ్లెట్ల సరఫరా వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్‌ను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో నిందితులను విచారిస్తున్నారు. నగరంలో డ్రగ్స్, నిషేధిత మత్తు పదార్థాల అక్రమ విక్రయాలను సహించేది లేదని, ఇలాంటి కార్యకలాపాలపై నిరంతర నిఘా కొనసాగిస్తామని అధికారులు హెచ్చరించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

