ఆకేరు న్యూస్, హైదరాబాద్:
హైదరాబాద్ శివార్లలోని పోచారం లో సినిమా తరహాలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. తనను పెళ్లి చేసుకోవడానికి ఒక యువతి నిరాకరించింది అన్న కోపంతో ఆ యువకుడు తనను ప్రేమించిన యువతికి హెచ్ఐవి పాజిటివ్ రక్తాన్ని ఇంజక్షన్ చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
పెళ్లి కొడుక్కి హెచ్ఐవీ పాజిటివ్.. పెళ్లి రద్దు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పోచారం కు చెందిన మనోహర్ కు ఇటీవల ఒక యువతితో పెళ్లి నిశ్చయమైంది. పెళ్లికి సంబంధించి ఏర్పాట్లు, షాపింగ్ దాదాపు అన్ని పూర్తయ్యాయి. అయితే ముహూర్తానికి కొద్దిరోజుల ముందు మనోహర్ కు హెచ్ఐవి పాజిటివ్ ఉన్నట్టు యువతి కుటుంబ సభ్యులకు బంధువుల ద్వారా తెలిసింది. ఈ విషయం తెలిసిన తర్వాత యువతి ఆమె కుటుంబ సభ్యులు ఈ సంబంధాన్ని రద్దు చేసుకున్నారు.
యువతితో గొడవకు దిగిన పెళ్లి కొడకు
హెచ్ఐవి పాజిటివ్ ఉన్న వ్యక్తిని, తాను పెళ్లి చేసుకుని జీవితాన్ని పంచుకోలేనని, తన జీవితాన్ని నాశనం చేసుకోలేనని యువతి తేల్చి చెప్పింది. దీంతో యువతి కుటుంబ సభ్యులు మనోహర్ తల్లిదండ్రులకు పెళ్లి రద్దు విషయాన్ని తెలియజేశారు. అయితే పెళ్లి రద్దు చేసుకున్న యువతి పైన కోపం పెంచుకున్న మనోహర్ దారుణానికి ఒడిగట్టాడు. బంధువుల మధ్య గ్రామంలో పరువు పోయిందని భావించిన అతను ఈనెల 11వ తేదీన యువతి ఇంటికి వెళ్ళాడు.
దారుణ ఘటన.. యువతికి హెచ్ఐవీ రక్తం ఎక్కించిన యువకుడు
పెళ్లెందుకు చేసుకోవడం లేదని యువతిని నిలదీసి గొడవకు దిగాడు. అనంతరం ముందే రెడీ చేసి తెచ్చుకున్న సిరంజీతో హెచ్ఐవి పాజిటివ్ రక్తాన్ని బలవంతంగా యువతి శరీరంలోకి ఎక్కించాడు. ఒక్కసారిగా షాక్ అయిన యువతి గట్టిగా కేకలు పెట్టగా, యువతి కేకలు విన్న కుటుంబ సభ్యులు ఇరుగుపొరుగువారు అక్కడికి చేరుకుని మనోహర్ ను పట్టుకున్నారు.
యువతి జీవితంతో ఆడుకున్న వ్యక్తిపై చర్యలకు డిమాండ్
ప్రస్తుతం బాధితురాలిని ఆసుపత్రిలో ఉంచి చికిత్స చేయిస్తున్నారు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు మనోహర్ పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతి జీవితంతో ఆడుకున్న మనోహర్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బాధితురాలి భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
