
* రేవంత్ సర్కారుకు ఇదో పెద్ద సవాల్!!
* రోడ్లపై మ్యాన్ హోల్ పొంగులు
* హైటెక్ మెరుపుల మధ్య.. డ్రైనేజీ మరకలు
* వానొచ్చినా.. రాకపోయినా.. పగలైనా.. రాత్రయినా అంతే
* తాజాగా హెచ్చార్సీ సీరియస్ తో మరోసారి తెరపైకి సమస్య
* తరచూ ఈ ఇబ్బందులు ఎందుకిలా?
ఆకేరు న్యూస్, స్పెషల్ ఫోకస్ :
భారీ ఆకాశ హర్మ్యాలు.. అద్దాల మేడలు.. రాత్రుళ్లు ధగధగలాడుతూ కనిపించే భారీ భవంతులు.. మిరుమిట్లు గొలిపే లైటింగ్లు. విశాలమైన రోడ్లు.. పైకి చూడ్డానికి ఫారిన్ లో ఉన్నామా అనిపించేలా తెలంగాణ రాజధాని హైదరాబాద్ కనిపిస్తుంది. పాలకులు కూడా విశ్వ నగరంగా హైదరాబాద్ మహానగరాన్ని తీర్చిదిద్దుతున్నామని పదే పదే చెబుతుంటారు. అటువంటి హైదరాబాద్ మహా నగరాన్ని ఏళ్ల తరబడి ఓ దారిద్య్రం వెంటాడుతోంది. వర్షం వచ్చినా, పోయినా.. రోజూ ఏదో చోట, ఆ ప్రాంతం, ఈ ప్రాంతం అనే తేడా లేకుండా మ్యాన్ హోళ్లు పొంగి పొర్లుతుంటాయి. రోడ్లపై డ్రైనేజీ నీరు పారుతూనే ఉంటోంది. ప్రముఖుల ఇలాకాలుగా పేరున్న బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల నుంచి.. బస్తీలు, కాలనీల్లోనూ మ్యాన్ హోళ్లు పొంగిపొర్లుతుంటాయి. ఒకరోజు ఈ రోడ్డు అయితే, మరో రోజు పక్క రోడ్డులో డ్రైనేజీ నీరు పారుతూ కనిపిస్తుంది.
స్వయంగా స్పందించిన హెచ్ ఆర్సీ
మహానగరంలో నిత్యం మ్యాన్ హోళ్లు పొంగిపొర్లుతూ ప్రజలు ఇబ్బందులు పడుతుండడంపై తాజాగా హ్యూమన్ రైట్స్ కమిషనర్ స్పందించింది. వాటర్ బోర్డు తీరుపై సీరియస్ అయింది. మ్యాన్ హోల్స్ లీకేజీ.. ప్రజల అసౌకర్యంపై సుమోటోగా కేసు నమోదు చేసింది. లీకేజీ ఘటనలపై విచారణకు కమిషన్ చైర్మన్ షమీమ్ అక్తర్ ఆదేశాలు జారీ చేశారు. జూన్ 4లోగా నివేదిక సమర్పించాలని వాటర్ బోర్డు ఎండీకి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ సమస్య మరోసారి వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి హైదరాబాద్‌లో మ్యాన్‌హోల్ లీకేజీలు ప్రజలకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఎప్పటి నుంచో ఇబ్బంది కలిగిస్తూనే ఉన్నాయి. మురుగు నీరు రోడ్లపైకి వస్తుండటంతో వాహనాల రాకపోకాలకు ఆటంకం ఏర్పడుతోంది. ట్రాఫిక్ సమస్యలూ ఉత్పన్నం అవుతున్నాయి.
రోజుల తరబడి..
కొద్ది రోజుల క్రితం చంపాపేట డివిజన్లో మ్యాన్‌హోల్ లీకేజీల వల్ల పలు కాలనీలు చిత్తడి చిత్తడిగా మారాయి. డ్రైనేజీలు పొంగిపొర్లుతుండటంతో వీధుల వెంట మురుగు పారుతున్నది. పాలకులు మారుతున్నా, ఏండ్లు గడుస్తున్నా సమస్య మాత్రం అలానే ఉంటోంది. చంపాపేట రెడ్డి కాలనీ రోడ్ నంబర్ 5లో డ్రైనేజీ మ్యాన్ హోల్స్ తరచూ పొంగి మురుగుపారుతోంది. రోజులు, నెలలు కాదు.. ఏళ్ల తరబడి అక్కడ ఈ సమస్య కొనసాగుతోంది. ఫిర్యాదులు వచ్చినప్పుడు, నామ్ కే వాస్తేగా తూతు మంత్రపు పనులుతప్ప, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదు. మురుగు సమస్యను పరిష్కరించాలని అధికారులకు ఫిర్యాదు చేసినప్పుడల్లా తాత్కాలికంగా గల్ఫర్ మెషిన్‌తో వచ్చి మ్యాన్‌హోళ్లలోని మురుగు నీటిని ఖాళీ చేసి చేతులు దులుపుకొంటున్నారు. కానీ ఈ సమస్య తరచూ ఎందుకు తలెత్తుతుందో మూలాల్లోకి వెళ్లి చర్యలు చేపట్టడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
డ్రైనేజీ మురికి కూపాలుగా..
అక్కడే కాదు.. జూబ్లీహిల్స్, కూకట్పల్లి, మూసాపేట, లష్కర్, బేగంపేట తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ డ్రైనేజీ మురికి కూపాలుగా మారుతున్నాయి. దీంతో ఆ ప్రాంతాలు దుర్గంధ భరితంగా మారుతున్నాయి. దీంతో పాటు రోడ్లపై రాకపోకలు సాగించలేక వాహనదారులు, పాదచారులు అనేక అవస్థలు పడుతున్నారు. ఈ సమస్య రాంగోపాల్‌పేట్, బేగంపేట్ డివిజన్లను కలిపే ప్రాంతాల్లో అనేక సంవత్సరాలుగా తలెత్తుతున్నాయి. కానీ ఇప్పటి వరకు పరిష్కారం కావడం లేదని స్థానికులు వాపోతున్నారు. డ్రైనేజీ మ్యాన్‌హోల్ లీకేజీపై మార్తాండనగర్ కాలనీలోని వినాయక వెల్ఫేర్ అసోసియేషన్ పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసింది.
ఎందుకీ దుస్థితి అంటే..
* హైదరాబాద్‌లో మ్యాన్‌హోల్ లీకేజీలకు ప్రధానంగా మురుగునీటి వ్యవస్థలో లోపాలు, పాత పైపుల వినియోగం, శిథిలమైన డ్రైనేజీ లైన్లు కారణాలు. అంతేకాకుండా, భారీ వర్షాల సమయంలో నీటిని తగినంతగా నిర్వహించలేకపోవడం వల్ల కూడా మ్యాన్‌హోల్స్ ఉప్పొంగి లీకేజీలకు దారి తీస్తోంది. ప్రధానంగా కోర్ సిటీలో చాలా కాలం నాటి పైపుల వల్లే సమస్యలు ఏర్పడుతున్నాయి. మురుగునీటి వ్యవస్థ నీటిని తగినంతగా నిర్వహించలేకపోవడం వల్ల మ్యాన్‌హోల్స్ ఉప్పొంగి లీకేజీలకు దారి తీస్తోంది. డ్రైనేజీ సామర్థ్యానికి మించి నిర్మాణాలు పెరగడం, అపార్ట్ మెంట్ల పైపులైన్లకు, వాటర్ బోర్డు పైపులైన్లకు లింకేజీలలో సమస్యలు ఏర్పడడం వల్ల కూడా రోడ్లపై మురుగు నీరు ప్రవహిస్తోంది. హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్న రేవంత్ సర్కారుకు ఈ డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణ పెద్ద సవాల్‌గా మారనుంది.
……………………………………….