Hyderabad Pod Cars
* డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ కార్లతో ప్రయాణం
* ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం దొరికేనా?
ఆకేరు న్యూస్, హైదరాబాద్: నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో వినూత్న రవాణా విధానాన్ని పరిశీలిస్తోంది. మెట్రో ప్రయాణికులు తమ చివరి గమ్యస్థానానికి సులభంగా చేరుకునేలా, ఐటీ కారిడార్‌లో రాకపోకలను వేగవంతం చేసే లక్ష్యంతో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (Personal Rapid Transit System – PRTS)ను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా డ్రైవర్ అవసరం లేకుండా నడిచే చిన్న ఎలక్ట్రిక్ పోడ్ కార్లను ప్రవేశపెట్టే ప్రతిపాదనను పరిశీలిస్తోంది.
*35 కిలోమీటర్ల మార్గంలో 64 స్టేషన్లు
తొలి దశలో కూకట్పల్లి నుంచి నాలెడ్జ్ సిటీ వరకు సుమారు 35 కిలోమీటర్ల మేర పోడ్ కార్ల మార్గాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ మార్గంలో మొత్తం 64 స్టేషన్లు నిర్మించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. కూకట్పల్లి, రాయదుర్గం, బయోడైవర్సిటీ జంక్షన్ మీదుగా ఈ కారిడార్ సాగనుంది. ఐటీ ఉద్యోగులు, మెట్రో ప్రయాణికులకు చివరి మైలు కనెక్టివిటీ (Last Mile Connectivity) కల్పించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం.
*మరో రెండు మార్గాలపైనా పరిశీలన
ఐటీ కారిడార్‌తో పాటు నగరంలోని ఇతర రద్దీ ప్రాంతాల్లోనూ పోడ్ కార్లను ప్రవేశపెట్టే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఎల్బీ స్టేడియం నుంచి అంబేడ్కర్ విగ్రహం, ఇందిరా పార్క్ మీదుగా రాణిగంజ్ వరకు ఒక మార్గాన్ని ప్రతిపాదించారు. అలాగే అసెంబ్లీ మెట్రో స్టేషన్ నుంచి రవీంద్రభారతి, సచివాలయం, ఐమాక్స్ మీదుగా బేగంపేట వరకు మరో మార్గాన్ని పరిశీలిస్తున్నారు.
*ప్రణాళికపై అధికారుల సమీక్ష
హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) ఈ ప్రాజెక్టుకు సంబంధించి సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేపట్టింది. అక్టోబర్ 27న ఈ అధ్యయనానికి సంబంధించి వివిధ వర్గాలతో సంప్రదింపుల సమావేశం నిర్వహించింది. నవంబర్ 18న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ప్రతిపాదిత తొలి దశ ప్రాజెక్టుపై అధికారులతో సమీక్షించారు. వివిధ శాఖలతో చర్చించి సమగ్ర రూట్ మ్యాప్, కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని HMRL అధికారులకు సూచించారు.
*ట్రాఫిక్‌కు ఎంతవరకు ఉపశమనం?
పోడ్ కార్లు అందుబాటులోకి వస్తే మెట్రో స్టేషన్ల నుంచి ఐటీ కార్యాలయాలు, ఇతర ప్రధాన ప్రాంతాలకు ప్రయాణం మరింత సులభమయ్యే అవకాశం ఉంది. ప్రైవేట్ వాహనాలపై ఆధారపడటాన్ని తగ్గించి, ప్రజా రవాణా వినియోగాన్ని పెంచడం ద్వారా రహదారులపై రద్దీని నియంత్రించాలన్నది ఈ ప్రతిపాదన వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం. అయితే ప్రాజెక్టు అమలు, నిర్మాణ వ్యయం, టికెట్ ధరలు, నిర్మాణ కాలపరిమితి వంటి అంశాలపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

