* డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా దుర్ఘటన
* తప్పించుకునే ప్రయత్నంలో వాహనదారుడి దూకుడు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసుల నుంచి తప్పించుకోబోయి ఓ వాహనదారుడు బీభత్సం సృష్టించాడు. కారును వేగంగా నడపడమే కాకుండా ఎస్ఐను ఢీకొట్టాడు. అంతటితో ఆగలేదు. బ్యానెట్ పై ఎస్ ఐను దాదాపు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. యాచారం పట్టణంలోని బస్టాండ్ వద్ద ఆదివారం రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో ఓ కారు వేగంగా వెళ్తుండడంతో ఆపాలని పోలీసులు సూచించారు. కానీ ఆపకపోవడంతో ఎస్సై మధు కారుకు అడ్డంగా వెళ్లారు. అయినా కారును ఆపకుండా ఎస్సైని ఢీకొట్టారు. దీంతో ఎస్ ఐ బ్యానెట్‌పై పడిపోయాడు. అయినప్పటికీ సదరు వ్యక్తి కారును ఆపకుండా సుమారు కిలోమీటర్ వరకు అలాగే ఎస్సైని తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే ఓ బైక్‌ను ఢీకొట్టాడు. యాచారం పట్టణం దాటిన తర్వాత కారు వేగం కాస్త తగ్గడంతో ఎస్సై బ్యానెట్‌పై నుంచి దూకేశాడు. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న వెంకట్ రెడ్డి, ఆయన కోడలు దివ్య, మనుమడు గాయపడ్డారు. దివ్య చేయి విరిగింది. యాచారం పోలీసుల సమాచారంతో ఇబ్రహీంపట్నం సమీపంలోని ఖానాపూర్ వద్ద పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడు కోహెడకు చెందిన శ్రీకర్‌గా గుర్తించారు. పోలీసులు విచారణ చేపడుతున్నారు.
……………………………………………
