* భారీగా కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ
* నిందితుడు మహ్మద్ అబ్దుల్లా అరెస్ట్.
హైదరాబాద్ ఆకేరు న్యూస్ : అపరిశుభ్ర వాతావరణంలో హానికర రసాయనాలతో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న కేంద్రంపై హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ తనిఖీల్లో నిందితుడు మహ్మద్ అబ్దుల్లాను అరెస్ట్ చేసి, సుమారు రూ. 4.5 లక్షల విలువైన సరుకును స్వాధీనం చేసుకున్నారు.
*ప్రమాదకర రసాయనాలతో తయారీ
నిందితుడు నాసిరకం అల్లం, వెల్లుల్లి పొట్టుకు అసిటిక్ యాసిడ్ వంటి రసాయనాలను కలిపి ‘A1 Sahara Gold’ బ్రాండ్ పేరుతో పేస్ట్‌ను తయారు చేస్తున్నాడు. ఈ తయారీ కేంద్రంలో ఈగలు, దుమ్ముతో నిండిన అత్యంత అపరిశుభ్ర పరిస్థితులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
*భారీగా నిల్వలు స్వాధీనం
పోలీసుల తనిఖీల్లో సుమారు 4,275 కేజీల వెల్లుల్లి, 800 కేజీల ఉప్పుతో పాటు గ్రైండర్లు, ప్యాకింగ్ యంత్రాలను సీజ్ చేశారు. ఈ కల్తీ ఉత్పత్తులను నగరంలోని హోటళ్లు, క్యాటరింగ్ సర్వీసులు మరియు హోల్‌సేల్ దుకాణాలకు సరఫరా చేస్తూ నిందితుడు భారీగా లాభాలు ఆర్జిస్తున్నాడు.
*పోలీసుల చర్యలు
మహమ్మద్ అబ్దుల్లాను అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ బృందం, తదుపరి విచారణ నిమిత్తం కేసును బోరబండ పోలీసులకు అప్పగించింది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఇలాంటి కల్తీ రాయుళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
