* సాఫ్ట్వేర్ వరుడి కక్కుర్తి.. బలైపోయిన భార్య
* సాఫ్ట్వేర్ దంపతుల మధ్య చిచ్చు రేపిన అదనపు కట్నం
* పెళ్లైన నెల రోజులకే నవవధువు నిషికా యాదవ్ బలవన్మరణం
* భర్త వేధింపులే కారణమని తల్లిదండ్రుల ఫిర్యాదు.
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకుంది.. కొత్త జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది.. కానీ ఆ ఆశలన్నీ అదనపు కట్నం అనే రక్కసి ముందు ఆవిరైపోయాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా సమాజంలో గౌరవప్రదమైన హోదాలో ఉన్నా, భర్త వేధింపుల నుంచి తప్పించుకోలేక చివరకు తనువు చాలించింది. హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
సోషల్ మీడియా పరిచయం.. ప్రేమగా మారి..
బీహార్‌కు చెందిన నిషికా యాదవ్, మధ్యప్రదేశ్‌కు చెందిన నీరజ్ బన్సల్ ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. 2020లో వీరికి సోషల్ మీడియా వేదికగా పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. మొదట్లో నిషికా తల్లిదండ్రులు ఈ వివాహానికి అభ్యంతరం తెలిపినప్పటికీ, తన ప్రేమను గెలిపించుకోవాలని ఆమె వారిని ఒప్పించింది. ఫిబ్రవరి 20, 2026న ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది.
నెల రోజులకే నూరేళ్ల మంట..
వివాహం అనంతరం ఈ జంట మియాపూర్‌లోని మక్త మహబూబ్‌పేటలో ఉన్న ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉండేవారు. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులే, చేతి నిండా సంపాదన ఉంది. కానీ, నీరజ్ మనసులో అదనపు కట్నంపై ఆశ పుట్టింది. పెళ్లి సమయంలో ఇచ్చిన లాంఛనాలు సరిపోవని, ఇంకా కావాలని నిషికాను వేధించడం మొదలుపెట్టాడు. అంతటితో ఆగక, ఆమె స్వేచ్ఛపై కూడా ఆంక్షలు విధించాడు. ఆఫీసులో ఎవరితో మాట్లాడకూడదని, ఫోన్ కాల్స్ లేదా చాటింగ్ చేయకూడదని మానసికంగా వేధించేవాడు.
చివరికి విషాదాంతం..
భర్త వేధింపులు రోజురోజుకూ మితిమీరిపోవడంతో నిషికా తీవ్ర మనస్తాపానికి గురైంది. తన బాధను ఎవరికీ చెప్పుకోలేక, బుధవారం తన నివాసంలోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. తమ కుమార్తెను నీరజ్ అదనపు కట్నం కోసమే వేధించి చంపేశాడని, ఇది ముమ్మాటికీ హత్యేనని నిషికా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లైన నెలన్నర రోజులకే ఈ ఘోరం జరగడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగుతోంది.
