* పోయిందనుకున్న బ్యాగ్‌ను గంటల్లోనే అప్పగించిన పోలీసులు!!
ఆకేరు న్యూస్,హైదరాబాద్: విధి నిర్వహణలో పోలీసులు తమ బాధ్యతను మరోసారి చాటుకున్నారు. స్కూటీపై వెళ్తూ పొరపాటున హ్యాండ్ బ్యాగ్ పోగొట్టుకున్న ఓప్రధానోపాధ్యాయురాలికి, జగద్గిరిగుట్ట పోలీసులు గంటల వ్యవధిలోనే ఆ బ్యాగ్‌ను తిరిగి అప్పగించి అండగా నిలిచారు.కూకట్పల్లి ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న ఓ మహిళ, విధుల్లో భాగంగా జగద్గిరిగుట్ట పరిధిలోని గాంధీ హైట్స్ మీదుగా స్కూటీపై వెళ్తున్నారు. ఆ సమయంలో ఆమె హ్యాండ్ బ్యాగ్ ప్రమాదవశాత్తూ రోడ్డుపై పడిపోయింది. బ్యాగ్‌లో విలువైన మొబైల్ ఫోన్ ఉండటంతో.. ఎవరైనా ఫోన్ లాక్ తీసి యూపీఐ (UPI) ద్వారా బ్యాంకు ఖాతాలోని నగదును విత్ డ్రా చేస్తారేమోనని ఆమె తీవ్ర ఆందోళనకు గురయ్యారు.బాధితురాలు వెంటనే జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ పి. నరేందర్ రెడ్డి నేతృత్వంలోని క్రైమ్ విభాగం పోలీసులు తక్షణమే స్పందించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, దర్యాప్తు చేపట్టిన పోలీసులు అతి తక్కువ సమయంలోనే పోయిన బ్యాగ్‌ను ట్రేస్ చేశారు.పోలీసులు స్వాధీనం చేసుకున్న బ్యాగ్‌ను బాధితురాలికి అప్పగించారు. అందులోని మొబైల్ ఫోన్, నగదు మరియు ఇతర ముఖ్యమైన పత్రాలన్నీ సురక్షితంగా ఉండటంతో ఆమె ఊపిరి పీల్చుకున్నారు. ఆపద సమయంలో వేగంగా స్పందించి తన సొత్తును కాపాడిన జగద్గిరిగుట్ట పోలీసులకు ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
…………………………………….
