*LPG సెగ.. ఆటో డ్రైవర్ల నిరసన
* హైదరాబాద్‌లో ట్రాఫిక్ కల్లోలం
ఆకేరు న్యూస్, హైదరాబాద్: భాగ్యనగరంలో ఆటో డ్రైవర్ల గ్యాస్ కష్టాలు కట్టలు తెంచుకున్నాయి. గత కొన్ని రోజులుగా నగరవ్యాప్తంగా కొనసాగుతున్న LPG కొరత ప్రభావం నేడు సాగర్ హైవేపై ఉద్రిక్తతకు దారితీసింది. గ్యాస్ కోసం గంటల తరబడి వేచి చూసినా ఫలితం లేకపోవడంతో, విసిగిపోయిన ఆటో డ్రైవర్లు సాగర్ రింగ్ రోడ్డు వద్ద భారీ నిరసనకు దిగారు.
* క్యూలైన్లలోనే గంటలు గడుస్తున్నాయి..
సాగర్ రింగ్ రోడ్డు సమీపంలోని పెట్రోల్ బంకుల్లో LPG స్టాక్ నిండుకోవడంతో వందలాది ఆటోలు కిలోమీటర్ల మేర క్యూ కట్టాయి. తెల్లవారుజాము నుంచి లైన్లలో నిలబడ్డా గ్యాస్ దొరకకపోవడంతో డ్రైవర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “రోజంతా లైన్లలోనే ఉంటే ఇక ట్రిప్పులు ఎప్పుడు వేయాలి? కుటుంబాలను ఎలా పోషించాలి?” అంటూ తమ ఆవేదనను వెలిబుచ్చారు. గ్యాస్ సరఫరాను క్రమబద్ధీకరించడంలో అధికారులు, ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యారని వారు ఆరోపించారు.
* స్తంభించిన సాగర్ హైవే.. ప్రయాణికుల నరకయాతన
డ్రైవర్లు రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలపడంతో సాగర్ హైవే అష్టదిగ్బంధనమైంది. ప్రధాన కూడలి వద్ద వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, స్కూల్ బస్సులు, అత్యవసర వాహనాలు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
* పోలీసుల రంగప్రవేశం..
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఆందోళనకారులతో చర్చలు జరిపి, గ్యాస్ ఏజెన్సీ ప్రతినిధులతో మాట్లాడారు. త్వరలోనే గ్యాస్ సరఫరాను పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో డ్రైవర్లు నిరసన విరమించారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేసి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.
* నగర రవాణాపై ‘గ్యాస్’ సెగ..
హైదరాబాద్‌లో సుమారు లక్షకు పైగా ఆటోలు LPG పైనే నడుస్తున్నాయి. ఇదే పరిస్థితి మరికొన్ని రోజులు కొనసాగితే నగరంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయే ప్రమాదం ఉందని ఆటో యూనియన్ నేతలు హెచ్చరిస్తున్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి బంకులకు నిరంతర గ్యాస్ సరఫరా జరిగేలా చూడాలని వారు డిమాండ్ చేస్తున్నారు
