
* ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై చర్యలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ లో హైడ్రా (HYDRA) కూల్చివేతలు కొనసాగుతున్నాయి. పోచారం మునిసిపాలిటీ కొర్రేములలోని లే అవుట్లలోని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. అక్రమ నిర్మాణాలపై ప్రజావాణిపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సోమవారం కొర్రేముల ఏకశిలానగర్ సర్వే నంబర్ 740, 741, 742లో 7.16 ఎకరాల భూమి చుట్టూ ఉన్న ప్రహరీని కూల్చివేశారు. ఏకశిలా వెంచర్ (EKASILA VENTURE)లో తప్పుడు పత్రాలను చూపించి, వ్యవసాయ భూములుగా రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయించారని, తమకు న్యాయం చేయాలంటూ ఏకశిలా నగర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ఇటీవల హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా బృందం రంగంలోకి దిగి వెంచర్ లో ప్లాట్లకు అడ్డుగా రియల్ ఎస్టేట్ (REAL ESTATE) వ్యాపారి నిర్మించిన ప్రహరీని కూల్చివేసింది. దీనిపై ఏకశిలా ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
……………………………………………………..