HYDRA Illegal Collections
* హైడ్రా పేరు చెప్పి దందా.. లక్షల్లో వసూళ్లు!
* భయపెట్టి బేరం కుదుర్చుతున్న అక్రమార్కులు
* ఈ దందాలో అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా..!
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ : “నిబంధనలకు విరుద్ధంగా మీ భవన నిర్మాణం ఉంది..? ఈ నిర్మాణం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తోంది.. మరి ఏంది సంగతి? నిర్మాణం ఆపించాలా? ఈ నిర్మాణం కూల్పించేయాలా? నేను హైడ్రాకు ఒక్క ఫోన్ కొడితే చాలు.. ఆలోచించుకో.. తర్వాత మీ ఇష్టం..!” అంటూ గ్రేటర్ పరిధిలోని కొందరు నిర్మాణదారులకు ఈ తరహా బెదిరింపులు వస్తున్నాయి.
కొందరు అధికారులు, ప్రజాప్రతినిధులు హైడ్రా పేరు చెప్పి బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లివిరుస్తున్నాయి. ఈ తరహా బెదిరింపులపై హైడ్రా అధికారులు కూడా స్పందించారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
* భయపెట్టి ముడుపులు వసూళ్లు
చెరువుల పరిరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగిప్తే లక్ష్యంగా ఏర్పాటు చేసిన హైడ్రా ఇప్పుడు కొందరి కేటుగాళ్లకు అందినకాడికి దండుకునే వనరుగా మారుతోంది. నగరంలో ఎక్కడ ఏ చిన్న నిర్మాణం జరిగినా, పాత భవనం కనిపించినా.. హైడ్రా బూచిని చూపిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా కడుతున్నారంటూ భవన యజమానులను భయపెట్టి, లక్షల్లో ముడుపులు దండుకుంటున్న ఉదంతాలు తాజాగా వెలుగులోకి రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. కుత్బుల్లాపూర్లో ఈ తరహా బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై అధికారులకు ఫిర్యాదులు కూడా అందినట్లు తెలిసింది.
* రూ.4 లక్షలు వసూలు చేస్తూ..
అధికార యంత్రాంగం నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సిన చోట, కొందరు స్థానిక రాజకీయ నాయకులు, కాలనీ సంఘాల ప్రతినిధులు, మరికొందరు చోటా లీడర్లు రంగంలోకి దిగుతున్నారు. ‘మీ భవనంపై హైడ్రా కన్నుపడింది, కూల్చివేస్తారంటూ’ అధికారుల పేరుతో హెచ్చరికలు జారీ చేస్తూ అక్రమ వసూళ్లకు తెరలేపుతున్నారు.
ఇటీవల మెహిదీపట్నం సర్కిల్లో వెలుగులోకి వచ్చిన ఓ ఉదంతం ఇందుకు నిలువెత్తు నిదర్శనం. హైడ్రా పేరు చెప్పి భవన యజమానుల నుంచి రూ.4 లక్షలు వసూలు చేస్తూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడటం, నగరంలో ఈ దందాలు ఏ స్థాయిలో వేర్లు తెంచుకున్నాయో స్పష్టం చేస్తోంది.
* కబ్జాలను మాత్రమే కూలుస్తాం..
నిజానికి హైడ్రా విధివిధానాలపై సంస్థ స్పష్టత ఇచ్చినా, క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉన్న అజ్ఞానాన్ని, భయాన్ని ఆసరాగా చేసుకుని మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీల విజ్ఞప్తి మేరకే.. ప్రజల ప్రాణాలకు ప్రమాదకరంగా ఉన్న భవనాలను, చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలోని కబ్జాలను మాత్రమే హైడ్రా కూల్చివేస్తుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
అంతేతప్ప, ఎవరికీ వ్యక్తిగతంగా నోటీసులు ఇచ్చి డబ్బులు వసూలు చేసే అధికారాలు ఎలాంటి స్థానిక సంఘాలకు గానీ, మధ్యవర్తులకు గానీ లేవు. అయినా సరే, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మి యజమానులు భయపడి డబ్బులు ఇచ్చుకుంటున్నారు.
* డబ్బులు డిమాండ్ చేస్తే ఫోన్ చేయండి..
ఈ నేపథ్యంలో హైడ్రా అధికారులు స్పందించి ప్రజలను అప్రమత్తం చేశారు. సంస్థ పేరు చెప్పి ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే భయపడాల్సిన అవసరం లేదని, వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని భరోసా ఇచ్చారు.
ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 లేదా హైడ్రా కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1070కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. బాధ్యులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

