* ఆక్రమణలపై హైడ్రా ప్రత్యేక దృష్టి
* ప్రజావాణి ఫిర్యాదులపై ఫోకస్
* తాజాగా ఫోన్ లోనూ అందుబాటులో
* ఇప్పటికే వందల కోట్ల ఆస్తుల పరిరక్షణ
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన ప్రత్యేక హైడ్రా. మూసీ రివర్ బెడ్, బఫర్ జోన్లలోని ఆక్రమణల తొలగింపు సమయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. కాలక్రమేణ హైదరాబాద్‌లోని కబ్జాల నిరోధం, చెరువులు, నాలాల పరిరక్షణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు పాటు పడుతూ నెగెటివ్ టాక్ ను పాజిటివ్ గా మార్చుకుంటోంది. ప్రతీ సోమవారం హైడ్రా ప్రజావాణి నిర్వహిస్తూ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తోంది. కాలనీలు, కమ్యూనిటీల్లో ప్రజావసరాల స్థలాలు, రోడ్లు, పార్కులు కబ్జాలపై వినతులు స్వీకరిస్తోంది. సంస్థ వద్దకు వచ్చిన ప్రతీ ఫిర్యాదునూ క్షుణ్నంగా పరిశీలిస్తోంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యటిస్తున్నారు. ఫిర్యాదుల ఆధారంగా పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. అవి ఆక్రమణలు అని తేలితే స్థలాలను స్వాధీనం చేసుకుని రక్షణ చర్యలు చేపడుతున్నారు.
వరద ముప్పునకు చెక్ పెట్టేలా..
అతి తక్కువ కాలంలోనే రూ. వందల కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలను, చెరువుల బఫర్ జోన్లలోని అక్రమ కట్టడాలను కూల్చివేసి, కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకుంది. నగరంలో క్రమశిక్షణతో కూడిన పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్ వరద ముప్పును తగ్గించడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది. నాలాలు, కుంటలు, చెరువుల బఫర్ జోన్లు మరియు ప్రభుత్వ భూములపై నిర్మించిన అక్రమ భవనాలను కూల్చివేసి ఆ భూములను పరిరక్షించింది. బంజారాహిల్స్, నార్సింగి వంటి ప్రాంతాల్లో రూ. వందల కోట్ల విలువైన భూములను కబ్జాదారుల నుండి స్వాధీనం చేసుకుంది. నగరంలో ఆకస్మిక వరదలు రాకుండా, నాలాల పక్కన ఉన్న ఆక్రమణలను తొలగించడం ద్వారా, భవిష్యత్తులో వరద పరిస్థితులను నివారించడానికి చర్యలు చేపట్టింది.
ప్రజా ఆదరణ
కూల్చివేతల ద్వారా చెరువులను, ప్రభుత్వ ఆస్తులను సంరక్షిస్తుండటంతో స్థానికులు, పర్యావరణ ప్రేమికుల నుండి ప్రశంసలు పొందుతోంది. అక్రమ నిర్మాణాలపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం ద్వారా నిరంతర నిఘా ఉంచి, తక్షణ కూల్చివేత చర్యలు చేపడుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హైడ్రా పనితీరుపై ప్రశంసలు కురిపిస్తూ, రాష్ట్ర ప్రయోజనాల కోసం, నగర సౌందర్యాన్ని పెంచేలా ఈ సంస్థ చేస్తున్న కృషిని అభినందించారు. ఫిర్యాదు అందితే చాలు.. పక్కాగా చర్యలు చేపడుతోంది. ఆక్రమణలపై హైడ్రా ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ప్రజావాణితో పాటు తాజాగా ఫోన్ లోనూ ప్రజలకు అందుబాటులో ఉండాలని నిర్ణయించింది. ఇలా విభిన్న పంథాలో ప్రభుత్వ స్థలాలు, చెరువుల పరిరక్షణకు పాటు పడుతోంది.
11 ఎకరాల్లో ఆక్రమణల తొలగింపు
శుక్రవారం (6-2-2026) ఒక్కరోజే హైడ్రా కోట్లాది రూపాయల విలువైన 15 ఎకరాల భూమిని కబ్జాల నుంచి రక్షించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలను తొలగించింది. దూలపల్లిలోని చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో దాదాపు 11 ఎకరాల విస్తీర్ణంలో స్క్రాప్ దుకాణాలు, రేకుల షెడ్లలో హోటల్లు, కంటెయినర్ల తయారీ, వెల్డింగ్ షాపులు ఏర్పాటు చేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయని నిర్ధారించుకున్న అధికారులు వాటిని తొలగించారు. అలాగే యూసుఫ్‌గూడ గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 128/1లోని 3.20 ఎకరాల భూమిని అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యుఎల్‌సీ) యాక్ట్ కింద ప్రభుత్వం గతంలో స్వాధీనం చేసుకుంది. యుఎల్‌సీ భూమికి ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చినట్టు తప్పుడు పత్రాలు సృష్టించి 3600 చదరపు గజాల స్థలాన్ని షరీఫ్‌ఖాన్ అనే వ్యక్తి ఆక్రమించాలని చూశాడు. కబ్జాను అడ్డుకోవడంతోపాటు షరీఫ్ఖాన్పై బోరబండ పోలీస్‌స్టేషన్‌లో హైడ్రా ఫిర్యాదు చేసింది. ఈ భూమితోపాటు ఇసుక, ఇటుక వ్యాపారాలు, తాత్కాలిక షెడ్లు వేసిన మొత్తం 3.20 ఎకరాలకు హైడ్రా ఫెన్సింగ్ వేసింది. భూమిలో ఆక్రమణలు పూర్తిగా తొలగించినట్టు అధికారులు తెలిపారు.
హైడ్రా బోర్డులే నిదర్శనం
నాగారం రామకృష్ణానగర్ కాలనీలోని 2017లో 400 చదరపు గజాల్లో శివాలయం నిర్మించారు. చుట్టూ 1365 చదరపు గజాల ఖాళీ స్థలం ఉంది. ఈ భూమిని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ, ఇతర విభాగాల అధికారులతో పర్యటించిన అధికారులు అది ఆలయ స్థలంగా నిర్ధారణకు వచ్చారు. 1365 చ.గల స్థలం శివాలయం భూమిగా పేర్కొంటు హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది. ఎక్కడ ఎంత విలువైన భూములను కాపాడిందో ఆయా ప్రాంతాల్లో ఆ సంస్థ ఏర్పాటు చేసిన బోర్డులను పరిశీలిస్తే అర్థం అవుతుంది.
