
* హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాల్సిందే
* చెరువులను కబ్జా చేసిన వారిని వదిలి పెట్టేది లేదు
* హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభంలో సీఎం రేవంత్‌రెడ్డి
ఆకేరున్యూస్, హైదరాబాద్: హైడ్రా అంటే కొందరికి కడుపు మంట అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. అందుకే హైడ్రాపై కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. హైడ్రా అనేది పేదల ఇళ్లు కూల్చడానికి కాదని.. ఆక్రణదారులను అడ్డుకోవడానికేనని ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మన పూర్వీకులు ఇచ్చిన చెరువులను కాపాడుకోవాలని ఈ సందర్భంగా ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. చెరువులు కనుమరుగైతే మన మనుగడ ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. 450 ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్‌ను కాపాడుకునేందుకు.. హైడ్రా ఉపయోగపడుతుందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని బుద్ద భవన్లో తొలి హైడ్రా పోలీస్‌స్టేషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చెరువులను ఆక్రమించిన వారు ఎంత పెద్దవారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎవరేమనుకున్నా కూల్చివేతల విషయంలో మాత్రం హైడ్రా వెనక్కి తగ్గేది లేదని తెలిపారు. వర్షం వస్తే చెన్నై, ముంబై మహానగరాల పరిస్థితి ఏంటో చూస్తున్నామని ఆయన సోదాహరణగా వివరించారు. కాలుష్యంతో ఢల్లీి విలవిల్లాడుతోంది.. ఈ పరిస్థితికి మానవ తప్పిదాలే కారణమని ఆయన పేర్కొన్నారు. మంచి పరిపాలన అందించేందుకు గడిచిన 76 ఏళ్లలో.. రాజ్యాంగాన్ని 100 సార్లకుపైగా సవరించుకున్నామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గుర్తు చేశారు. నగరాభివృద్ధి కోసం గత సీఎంలు ఎన్నో చట్టాలు చేశారన్నారు. 1908లో హైదరాబాద్‌లో వచ్చిన వరదలు చూసి.. అప్పటి నిజాం నవాబు కన్నీరు సైతం పెట్టు-కున్నారని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. అనంతరం హైడ్రా పోలీస్ స్టేషన్‌ను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా హైడ్రా వెబ్‌సైట్‌ను ఆయన ప్రారంభించారు. అలాగే 122 హైడ్రా వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ.. హైడ్రా తొమ్మిదిన్నర నెలల్లో ప్రజలకు మరింత చేరువైందన్నారు. ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖకు సంబంధించిన అధికారాలు.. హైడ్రా పోలీస్ స్టేషన్ ద్వారా కల్పించారన్నారు. వివిధ సందర్భాల్లో ఈ అధికారాలు తమకు ఉపయోగపడతాయని తెలిపారు. సీఎం ఏ ఉద్దేశ్యంతో హైడ్రాను ప్రారంభించారో.. అదే ఉద్దేశ్యంతో ఈ సంస్థ పని చేస్తుందని వివరించారు. సామాజిక బాధ్యతతో హైడ్రా ముందుకు వెళ్తుందని చెప్పారు. అసెస్ట్ ప్రొటెక్షన్ మాత్రమే కాకుండా.. డిజాస్టర్ రెస్పాండ్స్ కూడా సరైన అధికారులతో హైడ్రా పని చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.సాంకేతిక పరిజ్ఞానం కూడా పెద్ద ఎత్తులో వాడుతూ ఎఫ్టీ-ఎల్ పరిధి గుర్తిస్తున్నామన్నారు. హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు ద్వారా ల్యాండ్ గ్రేబింగ్, చీటింగ్, ఫోర్జరీ చేసే వారిపై చర్యలు తీసుకోనే అవకాశం దక్కిందన్నారు. ప్రజల ఆకాంక్ష మేరకు హైడ్రా ఇలాగే ముందుకు వెళ్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంబోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
…………………………………………………..