
* మోడర్న్ కాలనీలను నిర్మిస్తా
* ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
ఆకేరున్యూస్, వరంగల్: బస్తీలు బాగు చేస్తా కాలుష్య రహిత మోడర్న్ కాలనీలను నిర్మిస్తానని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. డివిజన్ పర్యటనలో భాగంగా 8 వ డివిజన్ ఇందిరా నగర్, టైలర్ స్ట్రీట్ లలో పర్యటించారు. పర్యటనలో చాలా చోట్లలో శిథిలావస్థకు చేరిన ఇళ్లను చూసిన ఎమ్మెల్యే వెంటనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని స్థానిక నాయకులకు విజ్ఞప్తి చేశారు. మురికి కాలువల పేరుకుపోయే చెత్తపై అసహనం వ్యక్తంచేశారు. 10 వ డివిజన్ వైశ్రయ్ రోడ్డుపై నిర్మాణం జరుగుతున్న డ్రైన్ బ్రిడ్జి పనులను పరిశీలించారు. పనిలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. నిర్మాణ పనులలో వేగం పెంచాలని ఆదేశించారు. టైలర్ స్ట్రీట్ నుండి సుధానగర్ వెళ్లే రోడ్డు నిర్మాణానికి నిధులను మంజూరు చేస్తానని ఎన్నికల నియమావళి ముగిసిన వెంటనే పనులను ప్రారంభిస్తామని చెప్పారు. నాలాల విస్తరణ, అభివృద్ధి పనులను త్వరితగతిన చేపట్టాలని సూచించారు. వర్షాకాలంలో నీటమునిగే ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే వెంటనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇంద్రానగర్ లో అంబేద్కర్ భవన్ నిర్మాణం, ప్రహరీ ఏర్పాటుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
……………………………….