
– చెల్లని చెక్కులు ఇచ్చిన కౌశిక్ రెడ్డి చెల్లని నోట్ అవుతాడు
– హుజురాబాద్ గడ్డ కాంగ్రెస్ అడ్డా
– టీపీసీసీ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్
ఆకేరు న్యూస్, కమలాపూర్ : హుజూరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చిన గెలిపించడానికి, తనకి అవకాశం ఇస్తే గెలవడానికి గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ అన్నారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడుగా పదవి చేపట్టిన తర్వాత గురువారం మొదటిసారిగా కమలాపూర్ విచ్చేశారు. కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు బైక్ ర్యాలీతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మీడియాతో మాట్లాడుతూ… స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దొరల చుట్టూ తిరుగుతూ ప్రజల్ని పట్టించుకోవట్లేదని , దళిత బంధు రెండవ విడత విడుదల కాకుండా అడ్డుకున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు.కౌశిక్ రెడ్డికి రాజకీయ జీవితం కాంగ్రెస్ వేసిన భిక్ష అన్నారు. చెల్లని చెక్కులు ఇచ్చిన కౌశిక్ రెడ్డి రాబోయే ఎలక్షన్లలో చెల్లని నోట్ అవుతాడని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా 42% బీసీ బిల్లును అడ్డుకుంటుందని, బిల్లు పట్ల బీఆర్ఎస్ పార్టీ తమ వైఖరిని స్పష్టం చేయాలని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ నాయకులను వేధిస్తే, తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను సైతం ప్రజలకు అందించడంలో నిర్లక్ష్యాన్ని చూపెడుతున్నాడని విమర్శించారు.హుజురాబాద్ గడ్డ అంటే కాంగ్రెస్ అడ్డా అనేలా కష్టకాలంలో పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను రాబోయే స్థానిక ఎన్నికల్లో గెలిపించుకోవడానికి కలిసికట్టుగా అందరం పూర్తి బాధ్యత తీసుకుంటామని స్పష్టం చేశారు. కమలాపూర్ లో వివిధ కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, పలు బాధిత కుటుంబాలను పరామర్శించి, ఓదార్చారు. కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.
………………………………………..